తెదేపాకు అలా చేస్తే ప్రజాబలం తేలుతుంది

ఎన్నికలు ముగిసి ఏడునెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే తెలుగుదేశం నాయకులు ఉప ఎన్నికల మాట ఎత్తుతున్నారు. అమరావతి రాజధానికి ప్రజల మద్దతు ఉన్నదో లేదో తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం…

ఎన్నికలు ముగిసి ఏడునెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే తెలుగుదేశం నాయకులు ఉప ఎన్నికల మాట ఎత్తుతున్నారు. అమరావతి రాజధానికి ప్రజల మద్దతు ఉన్నదో లేదో తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉప ఎన్నికలకు సిద్ధపడాలని వారు సవాళ్లు విసురుతున్నారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు తిరిగి ప్రజా తీర్పు కోరడానికి సిద్ధపడాలని వారు అంటున్నారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు సవాళ్లు విసురుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ, తెలుగుదేశం నాయకులకు దమ్ముంటే.. అమరావతి రాజధానికి ప్రజాబలం పుష్కలంగా ఉన్నదని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం, మార్గం ఉంది.

తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేలతోనే రాజీనామాలు చేయించి.. తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లాలి.. ‘చంద్రబాబు చెప్పిన అమరావతి రాజధాని’, ‘జగన్ చెప్పిన మూడు రాజధానులు’ అనే ఒకే అంశమ్మీద ఉప ఎన్నికలకు వెళ్లి.. ప్రజల తీర్పు కోరాలి. అప్పుడు అచ్చంగా ప్రజాబలం ఎవరికి ఉందో తెలుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక.. ప్రజల మన్నన, అభిమానం.. ఎన్నికల్లో చూరగొనలేకపోతే.. అప్పుడు మూడు రాజధానులు అనే విషయంలో వారి వాదన తప్పు అని నిరూపించి.. తప్పు దిద్దుకోవాల్సిందిగా డిమాండ్ చేయాలి అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా అమరావతికి ప్రజాబలం ఉందో లేదో తేల్చుకోవాలని తెదేపా డిమాండ్ చేయడం వల్ల సమస్య తేలదు. వైకాపా ప్రభుత్వం ఏర్పడింది గనుక.. వారి నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తున్నట్లే లెక్క. తాము చెబుతున్న మాటకు ప్రజల్లో బలముందో లేదో తేల్చుకోవాల్సింది తెదేపానే!

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి వారు గెలిచారు. ఆ 22 మందితో రాజీనామాలు చేయించి.. కేవలం రాజధాని అంశం ఒక్కటే ఎజెండాగా తెలుగుదేశం మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. కేవలం సవాళ్లతో ఆగిపోకుండా.. అటో ఇటో తేలాలంటే.. వైకాపా వారిని బతిమాలే బదులు.. తమ వారితో రాజీనామాలు చేయించినా సరిపోతుంది. అది వారి చేతుల్లో పని.

తెదేపా తిరిగి ఆ  సీట్లను గెలుచుకుంటే గనుక.. అమరావతికే ప్రజల మద్దతు ఉన్నట్లు లెక్క. ఒక్క సీటు తగ్గినా, ఒక్కసీటులో వైకాపా గెలిచినా… మూడు రాజధానులకే మద్దతు ఉన్నట్లు లెక్క.  చాలా సింపుల్ గా తేలిపోతుంది. తెదేపాకు ధైర్యముంటే ఇలా చేయాలని ప్రజలు అనుకుంటున్నారు.