కేవలం కక్ష సాధింపు కోసమే కృష్ణకిషోర్ పై కేసులు పెట్టారట. ఆయన సత్యహరిశ్చంద్రుడికే కజిన్ బ్రదరంట. నిజాయితీలో ఐఎస్ఐ మార్క్ అంట. గతంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించారు కాబట్టే ఇప్పుడు కృష్ణకిషోర్ పై పగబట్టారట. ఇదీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు. నిజంగా ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరించాలని అనుకుంటే… బాబు హయాంలో మంత్రులుగా పనిచేసినోళ్లు ఎంతోమంది ఈపాటికి ఊచలు లెక్కబెట్టేవారు. అధికారులేం ఖర్మ, టీడీపీ నేతలే కేసులు రుచిచూసేవారు.
కొన్నాళ్ల్ కిందటే కృష్ణకిషోర్, వైఎస్ జగన్ కు అర్జీ పెట్టుకున్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్లేలా తనను రివీల్ చేయాలని కోరారు. సరిగ్గా అప్పుడే అతడి బండారం బయటపడింది. బాబు ముసుగులో పబ్బం గడిపేసిన కృష్ణకిషోర్ చేసిన అరాచకాలు బట్టబయలయ్యాయి. కోట్లాది రూపాయల ప్రజాధానం దుర్వినియోగం చేయడమే కాదు, తన అస్మదీయులకు ఏపీ ఆర్థికాభివృద్ధి మండలిలో పదవులిచ్చుకున్నారనే విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది. వీళ్లలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎలా పదువులు దక్కించుకున్నారో ఇప్పటికే వివరాలు బయటకొచ్చాయి. ఇప్పుడు కూడా కృష్ణకిషోర్ పై కేసులు పెట్టడం తప్పంటే.. చంద్రబాబు విచక్షణకే దాన్ని వదిలేయొచ్చు.
అంతెందుకు.. ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా సేవలందించాల్సిన కృష్ణకిషోర్, అప్పటి మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ సేవలో తరించిన విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ సమావేశానికి రాష్ట్రం తరఫున హాజరవ్వాలంటే భారీగా డబ్బు చెల్లించాలి. అందుకే ఏ ఇతర రాష్ట్రం ఆ సమావేశానికి హాజరుకాలేదు. కానీ కృష్ణకిషోర్ మాత్రం ఈడీబీ నుంచి భారీగా డబ్బులు చెల్లించి, లోకేష్ ను ఏపీ ప్రతినిధిగా అక్కడికి పంపేలా మంత్రాంగం నడిపారు.
కట్టుబట్టలతో వచ్చాం, కష్టాల్లో ఉన్నామంటూ బీద అరుపులు అరిచిన చంద్రబాబు.. కృష్ణకిషోర్ ను అడ్డం పెట్టుకొని ఈడీబీ నుంచి కోట్ల రూపాయల ఫీజును వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ కు చెల్లించారు. ఈ ఫీజ్ కాకుండా ఫైవ్ స్టార్ వసతులు, విమాన చార్జీల్లాంటివి కూడా కృష్ణకిషోర్ సంతకంతో ఈడీబీ నుంచి ట్రన్సఫర్ అయ్యాయి. పైకి ఇవన్నీ పారదర్శకంగా కనిపించొచ్చు, లోపలికి వెళ్తే అంతా అవినీతిమయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డ్ సీఈవోగా చాలా జాస్తి (అతి) చేశారు కృష్ణకిషోర్.
అవినీతిరహిత పాలన అందిస్తానంటూ ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్, చెప్పినట్టుగానే ప్రతి విభాగంలో కరప్షన్ కు తావులేకుండా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే కృష్ణకిషోర్ పై కూడా వేటు పడింది. అతడిపై కేసులు పడ్డాయి. అంతే తప్ప, ఇది ఎంత మాత్రం కక్షపూరితం కాదు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల దుబారా జరిగిందని జగన్ పదేపదే చెబుతూ వచ్చారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఇలా దశలవారీగా బయటపడుతూ వస్తున్నాయి.