యెల్లో బ్యాచ్ ఒకర్ని టార్గెట్ చేసింది అంటే.. పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ దాన్నే నిజమని నమ్మించగలదు. తాజాగా టీడీపీ, దాని అనుకూల మీడియా, వారి ప్రేరేపిత సోషల్ మీడియా.. ఇలా అంతా కలిసి ఒక్కరినే టార్గెట్ చేశాయి. మంత్రి అనిల్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటి?
నోటి పారుదల శాఖ మంత్రి, ఇరిటేషన్ శాఖ మంత్రి అంటూ అనిల్ పై మీమ్స్ సృష్టిస్తూ కామెడీ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల నుంచి కేవలం మంత్రి అనిల్ ని ట్రోల్ చేయడం పైనే యెల్లో బ్యాచ్ పూర్తి ఫోకస్ పెట్టింది. చినబాబు కూడా కార్యకర్తలు చేసిన వీడియోలని ట్విట్టర్ లో పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు.
ఎన్నికలకు ముందు జగన్ కి బలమైన మద్దతుగా వినిపించిన కొన్ని గొంతులు మూగబోయిన వేళ, మంత్రి అనిల్ ఒక్కరే తమ అధినేతకు బాసటగా నిలిచారు. జగన్ పేరెత్తితే ప్రతిపక్షాలపై విరుచుకు పడిపోతున్నారు. తమ అధినేతను విమర్శించాలని చూస్తే.. చినబాబు అయినా, పెదబాబు అయినా వారిపై శివాలెత్తిపోయేవారు అనిల్. దీంతో సహజంగానే ఆయన టీడీపీకి టార్గెట్ అయ్యారు.
జగన్ అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో కాస్తో కూస్తో వైసీపీ తరపున బలంగా మాట్లాడుతోంది అనిల్ ఒక్కరే. అందుకే ఆయన టీడీపీకి టార్గెట్ అయ్యారు. ఇప్పుడే కాదు, అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబుకి, లోకేష్ కి పూర్తిగా ఇరిటేషన్ తెప్పించారు మంత్రి అనిల్.
అసెంబ్లీలో బుల్లెట్ దిగిందా లేదా అంటూ బాబుపై సినిమా డైలాగులు పేల్చి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నోరు మూయించారు. ఇక కౌన్సిల్ కి వెళ్లి మరీ లోకేష్ ని చెడుగుడు ఆడుకున్నారు. పప్పు పప్పు అంటూ పరువు తీశారు. దీంతో తండ్రీకొడుకులిద్దరి ఇగో బాగా హర్ట్ అయింది.
అసెంబ్లీ తర్వాత కూడా టీడీపీని వదలకుండా వెంటపడుతుండే సరికి ముందు అనిల్ ని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తోంది టీడీపీ. రెండు రోజుల నుంచి జగన్ టార్గెట్ గా పెడుతున్న సోషల్ మీడియా పోస్టింగ్ ల కంటే మంత్రి అనిల్ పై వదులుతున్న కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి నుంచి అనీల్ ఎలా బయటపడతారో చూడాలి.