బాదుడే బాదుడు.. మళ్లీ మోగని గంటా

మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పూర్తి స్థాయిలో టీడీపీని వదిలేశారా..? లేక అవకాశం వచ్చినప్పుడు కలసిపోతారా అనేది తేలాల్సి ఉంది. …

మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పూర్తి స్థాయిలో టీడీపీని వదిలేశారా..? లేక అవకాశం వచ్చినప్పుడు కలసిపోతారా అనేది తేలాల్సి ఉంది. 

ఉత్తరాంధ్రలో పర్యటించిన చంద్రబాబుకి గంటా మొహం చాటేశారు. ఎయిర్ పోర్ట్ కి స్వాగతం పలికేందుకు వచ్చారు కానీ, ఆ తర్వాత మాయమయ్యారు. కనీసం వైజాగ్ పార్టీ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో కూడా గంటా లేరు. ఈ విషయంలో గంటా వియ్యంకుడు నారాయణ, చంద్రబాబుతో చేసిన రాయబారం కూడా ఫలించలేదంటున్నారు. మొత్తమ్మీద గంటా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి దూరంగానే ఉంటారని తెలుస్తోంది.

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా.. మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కాపు సామాజిక వర్గ సమావేశాలకు మాత్రం ఆయన పాల్గొంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదింపజేసుకోడానికి కూడా ప్రయత్నించారు. తన సహచర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లాగా ఆయన పార్టీ మారలేదన్నమాటే కానీ, టీడీపీతో మాత్రం ఆయన కలసి లేరు అనేది వాస్తవం.

అయితే ఈ వాస్తవాన్ని ఒప్పుకోడానికి అటు టీడీపీ కూడా సిద్ధంగా లేదు. గంటా తమవాడేనంటారు కానీ దగ్గరకు తీయరు, పోనీ ఆయన కూడా పార్టీ దగ్గరకు రారు. ఇలా అధినాయకుడు వచ్చిన మీటింగ్ లకి కూడా హాజరు కాకపోవడంతో గంటాపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

అయ్యన్నతో తంటాలు..

అటు అయ్యన్న పాత్రుడికి గంటాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ బురదపాములంటూ ఇటీవల గంటాపై అయ్యన్న కామెంట్లు చేయడంతో వారిద్దరి మధ్య వ్యవహారం పూర్తిగా చెడింది. అధిష్టానం కూడా ఈ రెండు గ్రూపుల్ని ప్రోత్సహించి తమాషా చూస్తోంది. 

వచ్చే దఫా గంటా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదనే విషయం గ్రహించారు కాబట్టే చంద్రబాబు కూడా ఆయన్ను పట్టించుకోవడంలేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర బాదుడికి గంటా దూరమయ్యారు. ఇదే తరహాలో.. మిగతా చోట్ల కూడా పార్టీకి దూరంగా ఉన్నవారు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉందని తెలుస్తోంది.