ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. తెలంగాణలో ఏడాదిలోనే ఎన్నికలొస్తున్నాయి. మరి తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీలో ఉంటుందా..? లేదా..? సెంటిమెంట్స్ ఏమైనా కలిసొస్తాయా?
2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు విడివిడిగా జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ తన అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోగా, ఇక్కడ ఏపీలో బాబు బొక్కబోర్లా పడ్డారు. మూడో దఫా ఎన్నికలకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది.
ఏపీ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం మరీ తొందరేమో కానీ, తెలంగాణలో మాత్రం ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కి బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో బీజేపీలో ఉత్సాహం రెట్టింపైంది. అటు కాంగ్రెస్ కూడా కాచుక్కూర్చుంది.
ఇటు ఏపీలో మాత్రం ఎన్నిక ఏదైనా వైసీపీదే ఏకఛత్రాధిపత్యం. స్థానిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనే వైసీపీదే విజయం. అంత మాత్రాన ప్రజల్లో వ్యతిరేకత సున్నా అని చెప్పలేం. ఇక్కడ కూడా ఉద్యోగస్తుల్లో ఒకరకమైన అభద్రతా భావం ఉంది. జీతాల పెంపు, సీపీఎస్.. తదితర సమస్యలతో ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఎన్నికలనాటికి అంతా సర్దుకుంటుందని అనుకుంటున్నారు.
కానీ ఈలోపే ఓ పద్ధతి ప్రకారం ఏపీలో ఏదో జరిగిపోతోందనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది టీడీపీ అనుకూల మీడియా. పదే పదే అలాంటి వార్తలతో ప్రజల్ని రెచ్చగొడుతోంది. ప్రస్తుతం బాదుడే బాదుడు అనే కాన్సెప్ట్ ఇందులో భాగమే.
తెలంగాణ ప్రభావం ఉంటుందా..?
తెలుగు రాష్ట్రాలు రెండయినా.. రాజకీయంగా ప్రజల ఆలోచనా విధానాలు దాదాపు ఒకటే. అంటే 2023 ఎన్నికల్లో అక్కడ బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటే.. ఇక్కడ కూడా ప్రతిపక్షాలకు ఆశలు చిగురిస్తాయి. 2023 ఎన్నికల్లో అక్కడ బీజేపీ బలపడితే.. 2024లో ఏపీలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తులో ఉంటే కచ్చితంగా కాషాయదళం మరిన్ని కండిషన్లు పెట్టే అవకాశముంది. జనసేనాని కూడా బీజేపీ చెప్పిన మాటకల్లా తలాడించాల్సిందే.
ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు టీఆర్ఎస్ పెద్ద షాకిస్తే మాత్రం ఏపీలో కూడా ప్రతిపక్షాలకు అది పెద్ద షాకేనని చెప్పాలి. మరీ ఫలితాల్లో సంచలనాలు లేకపోతే మాత్రం అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ వైసీపీకి విజయం నల్లేరుపై నడకే.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంది అనేది తెలంగాణ ఎన్నికలతో తేలిపోతుంది. అది చూశాక ఇక్కడ జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.