
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భవిష్యత్ వారసుడు నారా లోకేశ్‌పై పార్టీకి చెందిన సీనియర్ నేత బండబూతులు తిట్టినట్టు విశ్వసనీయ సమాచారం. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో మొదటి రోజు శనివారం ఈ ఘటన జరిగింది. మహానాడు వేదికపై 400 మంది ముఖ్యులు ఆసీనులయ్యేలా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహిస్తున్న ప్రాంతానికి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పిలుచుకునే పెద్దాయన వేదికపైకి వెళ్లారు.
వేదికపై పిల్ల బ్యాచ్, కింద వీఐపీ గ్యాలరీల్లో ముఖ్య నాయకులు కూచోవడం సీనియర్ నాయకుడి కంట పడింది. దీంతో వేదికపై కూచున్న పిల్ల బ్యాచ్ ఎవరో తెలుసుకుందామని ఆరా తీశారు. వీళ్లంతా లోకేశ్ టీమ్ అనే సమాధానం ...ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం.
అసలే లోకేశ్ అంటే ఆ సీనియర్ నాయకుడికి కోపం. చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఆ సీనియర్ నేత దివంగత ఎన్టీఆర్ వైపే ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.
అయితే పేరులోనే చౌదరి అనే అలంకారాన్ని దక్కించుకున్న సదరు నాయకుడు టీడీపీని విడిచి పెట్టలేక, గత్యంతరం లేని పరిస్థితిలో ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు వైపు వెళ్లారు. అప్పట్లో ఆ నాయకుడు చేసిన పరుష కామెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని కనీసం సుదీర్ఘ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మంత్రి పదవి ఇవ్వని సంగతి తెలిసిందే.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో లోకేశ్‌పై ఆ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీసం ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోరని, తిరిగి సమాధానం ఇవ్వరని మండిపడ్డారు. ఆ తర్వాత బుజ్జగించడంతో టీడీపీలోనే సర్దుకుపోయారు.
తాజాగా మహానాడు వేదికపై పెద్దవాళ్లకు కూడా పిల్ల బ్యాచ్‌కు చోటు కల్పించడంపై ఆయన ఆగ్రహించారు. ఈ సందర్భంగా లోకేశ్, ఆయన టీమ్‌పై పరుష వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సదరు సీనియర్ నాయకుడు ఏమన్నారంటే... 'లోకేశ్ ఓ చిల్లర నాయకుడు. అతని వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోతోంది. ఇది చాలదన్నట్టు అతనికి ఇలాంటి చిల్లరోళ్లంతా తోడయ్యారు. ఇలాగైతే టీడీపీ బతికి బట్ట కట్టేదెట్టా? మహానాడు వేదికపై పెద్దలకు చోటు ఇచ్చి గౌరవించాలన్న ఇంగితం లోకేశ్‌కే లేకపోతే, ఇక ఆయన టీమ్‌కు ఏముంటుంది?' అని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు లోకేశ్ ఆ వేదికపై లేరు. పార్టీ సీనియర్ నేతలు, అది కూడా లోకేశ్ అంటే గిట్టని వాళ్ల ఎదుట జరిగిన సంభాషణగా చెబుతున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా