పాడెమీదికి తెలుగు భాష!

జగన్మోహన రెడ్డి సర్కారు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అది తెలుగు భాషకు అత్యంత చేటు చేసే నిర్ణయం. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి, 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలందరికీ ఇంగ్లిషు…

జగన్మోహన రెడ్డి సర్కారు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అది తెలుగు భాషకు అత్యంత చేటు చేసే నిర్ణయం. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి, 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలందరికీ ఇంగ్లిషు మీడియంలో మాత్రమే పాఠాలు బోధించాలనేది తాజా ప్రభుత్వాదేశం. ఆ తర్వాతి ఏడాది 9-10 తరగతులకు కూడా ఇదే వర్తింపజేస్తారు.

తెలుగు అనేది కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది. ఇదంతా తెలుగు భాషను పాడె ఎక్కించే ప్రయత్నంగా పేర్కొనాల్సిందే. కొన్నాళ్లు గడిచేసరికి.. తెలుగుభాష కు సమాధి కూడా పూర్తవుతుంది.

ఇంగ్లిషు మీడియం వల్ల మన నైపుణ్యాలకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే భ్రమలు ఈ ప్రభుత్వానికి ఉండవచ్చు. కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందడానికి  మనవారికి ఇప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అంతర్జాతీయ యవనికపై తెలుగు యువతరం గరిష్టంగానే ఉద్యోగాలు సొంతం చేసుకోగలుగుతోంది. అంటే ఇప్పటి విద్యావిధానంలో ఉన్న బోధనే.. వారికి ఆ నైపుణ్యాలను అందిస్తోంది.

ఉద్యోగాలు పొందకుండా.. వెనుకబడుతున్న వారు ఎవరైనా ఉన్నారా…? అంటే.. వారు కేవలం తెలుగు మీడియం కావడం వల్లనే వెనుకబడిపోతున్నారని అనుకోవడం భ్రమ. అసలు విషయం లేకపోవడం వల్ల మాత్రమే వారు వెనుకబడుతున్నారు.

ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ప్రస్తుతం కూడా వృత్తి విద్యా కోర్సులన్నీ  కూడా ఇంగ్లిషు మీడియంలోనే సాగుతున్నాయి. ఆ మాత్రం ఆయా కోర్సుల పరిజ్ఞానం వారికి సరిపోతుంది. కానీ.. మౌలికంగా.. వారికి తెలుగు భాషా జ్ఞానం ఉండడం తప్పనిసరి.

అయితే తెలుగు మీడియంను పూర్తిగా కాలరాచి, ఇంగ్లిషు మీడియంలో మాత్రమే ప్రతి ఒక్క పిల్లవాడూ చదువుకుంటే తప్ప వారికి భవిష్యత్తు ఉండదనే భావన ప్రభుత్వానికి ఎందుకు కలిగిందో గానీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

ఒక సబ్జెక్టుగా మాత్రమే తెలుగు ఉండడం అంటే.. దాని వల్ల చాలా దుష్పరిణామాలు తప్పవు. భవిష్యత్తులో మండల స్థాయిలో చిన్న అధికారికి ఒక వినతిపత్రం ఇవ్వాలన్నా.. ప్రజలు, పేదలు, సామాన్యులు… వాటిని ఇంగ్లిషులో రాయించుకుని వెళ్లాలి.

ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ప్రతి చిన్న స్థాయి అధికారికి ఒక దుబాసీ అవసరమైనా ఆశ్చర్యం లేదు. మనకు హిందీ ఒక సబ్జెక్టుగా ఉంది. కానీ.. పెద్దవాళ్లయ్యాక ఎంతమంది హిందీని ధారాళంగా చదవగలుగుతున్నారో? అర్థం చేసుకోగలుగుతున్నారో మనకు తెలుసు! రేపు.. తెలుగు భాష పరిస్థితి కూడా అంతే ఘోరంగా తయారవుతుంది.

ఇలాంటి దుస్థితి వాటిల్లకుండా జగన్ సర్కారు.. ఈ విషయంలో పునరాలోచన చేసి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.