Advertisement

Advertisement


Home > Politics - Gossip

శుక్రవారం సాయంత్రానికి 3 రాజధానులు.. వ్యూహమిదే!

శుక్రవారం సాయంత్రానికి 3 రాజధానులు.. వ్యూహమిదే!

ఒక వర్గం నుంచి ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఇది వరకు న్యాయపరమైన ఇబ్బంది రావడంతో.. సిఆర్డీయే రద్దు ను ఉపసంహరించుకోవడం ద్వారా వెనక్కు తగ్గిన సర్కారు.. తాజాగా మరింత పటిష్టంగా న్యాయపరంగా చిక్కులేమీ రాకుండా మూడురాజధానుల బిల్లు ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి శుక్రవారం సాయంత్రానికి మూడు రాజధానుల బిల్లు శాసనసభ ఆమోదం పొందుతుందని అనుకుంటున్నారు. ఇందులో పెద్ద వ్యూహమే దాగి ఉంది. 

నిజానికి జగన్ సర్కారు.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో మూడు రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా ఉన్నదనే ప్రచారం బాగా జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే.. ఈ శాసనసభ సమావేశాలకు భారీ ఎత్తున భద్రత బలగాలను అసెంబ్లీ చుట్టూ మోహరిస్తున్నారు. ఈ మేరకు స్పీకరు ఉత్తర్వులు ఇచ్చారు. ఒకవైపు దసరా నుంచి విశాఖలో పరిపాలన మొదలవుతుందని ప్రభుత్వంలోని మంత్రులు వేర్వేరు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టబోతున్నారనడానికి సంకేతాలే.

ముఖ్యమంత్రి జగన్ తొలిరోజు సభలోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతారని, ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇస్తారని వార్తలు వస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు సభ ఎదుటకు వస్తే నానా రాద్ధాంతం చేయడానికి గగ్గోలు పెట్టడానికి తెలుగుదేశం కూడా ప్రిపేర్డ్ గా ఉంది. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న దానిని బట్టి.. తొలిరోజు గురువారం సభ ఎదుటకు మూడు రాజధానుల బిల్లు వచ్చినా సరే.. రెండోరోజు శుక్రవారం సాయంత్రం దాకా చర్చను సాగదీసి.. సాయంత్రం పొద్దుపోయే వేళకు ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అంటే.. శుక్రవారం సాయంత్రానికి మూడు రాజధానుల తీర్మానం సభ ఆమోదం పొందుతుంది. ఆ వెంటనే అదే రోజు గవర్నర్ సంతకానికి కూడా పంపే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. 

మొత్తానికి శని, ఆదివారాల కెల్లా.. వీలైనన్ని ఆఫీసులను విశాఖకు తరలించేయాలనేది ప్లాన్. సోమవారం నాటికే విశాఖ నుంచి కొన్ని కార్యాలయాలు పనిచేయడం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. 

దీని వెనుక వ్యూహం ఏంటంటే.. శుక్రవారం సాయంత్రానికి తీర్మానం ఆమోదం పొందితే.. శని ఆదివారాలు కోర్టుకు సెలవులు గనుక.. అప్పటికప్పుడు హైకోర్టులో పిటిషన్లు వేయడానికి అవసరం ఉండదు. ఈ రాజధాని విషయాన్ని తక్షణం సెలవురోజున కూడా విచారించాల్సిన కేసుగా పరిగణించే అవకాశం తక్కువ. 

అంటే.. గవర్నరు సంతకం అయిపోతే గనుక.. దానికి సమాంతరంగా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ తరలించేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. సోమవారం నుంచి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పాలన మొదలవుతుంది.. అమరావతి ఎటూ శాసన రాజధానిగా అప్పటికి సమావేశాలు జరగుతూనే ఉంటాయి. ఇలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ తర్వాత కోర్టులో పిటిషన్లు వేసినా సరే.. రాజధాని, పరిపాలన ఆల్రెడీ విశాఖ నుంచి మొదలైపోయింది అనే వాదనతో ప్రభుత్వం కౌంటర్ లు ఇచ్చే అవకాశం ఉంది. తరలించడానికి ముందు ఉండే విచారణకు, ఆల్రెడీ రాజధాని విశాఖ నుంచి పనిచేస్తుండగా చేసే విచారణకు తేడా ఉంటుంది. ప్రభుత్వం ఈ వ్యూహంతోనే చాలా జాగ్రత్తగా, గోప్యంగా మూడు రాజధానుల బిల్లు విషయంలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?