మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. ఆ చేసిన మంచిపనిలో ఉండే వారి కష్టం, త్యాగం, అంకితభావం వంటి వాటిని బట్టి వారి కాళ్లకు మొక్కాలి. ఇది మనుషులుగా మనకు ఉండాల్సిన లక్షణం.
మంచి పని చేసిన వారిని ప్రశంసించడానికి కూడా కులం చూసుకుంటే, ఆ మంచి పని క్రెడిట్ ను కూడా తన కులం వారి ఖాతాలో వేసేయాలని ఆరాటపడితే ఆ కులపిచ్చిని ఎలా అర్థం చేసుకోవాలి. తన బుద్ధిలోనే అలాంటి హేయమైన కులపిచ్చి ఉన్నదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తాజాగా నిరూపించుకున్నారు.
విషయం ఏంటంటే.. హైదరాబాదు నుంచి విశాఖ వెళుతున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో.. అదే రైల్లో ప్రయాణిస్తున్న హౌస్ సర్జన్ వైద్య విద్యార్థి స్వాతిరెడ్డి ఆమెకు ప్రసవం చేశారు. పండంటి అమ్మాయికి ఆ తల్లి జన్మ ఇచ్చింది.
స్వాతిరెడ్డి సమయస్ఫూర్తికి, సమయానికి స్పందించిన వైఖరికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం ప్రసవం చేయాల్సిన అవసరం ఉండగా.. ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా స్వాతి రెడ్డి పూర్తిచేసిన వైనం, శ్రద్ధ అందరినీ ముగ్ధుల్ని చేసింది. అందరూ ఆమెను కీర్తిస్తున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు కూడా తన ట్విటర్ ఖాతాలో స్వాతిరెడ్డిని అభినందించారు.తల్లీబిడ్డను కాపాడిన స్వాతిరెడ్డి ఆదర్శం అని అన్నారు. అంతలోనే ఆయనకు ఆ అమ్మాయి కులం గుర్తుకు వచ్చినట్టుంది. ఘనత, కీర్తి ఏదైనా దక్కేలా ఉంటే అది తన కులానికి దక్కాలి కదా అనే ఆలోచన వచ్చినట్టుంది. ఆ అమ్మాయి చదువుతున్న కాలేజీ తన కులానికి చెందిన గీతం యూనివర్సిటీ కదా అనే ఆలోచన వచ్చినట్టుంది. వెంటనే ఇంకో ట్వీటు పెట్టారు.
‘‘వైద్యపరికరాలు అందుబాటులో లేకున్నా.. తన ప్రతిభను వాడి పేషంటుకు అండగా నిలిచేలా స్వాతిరెడ్డిని తీర్చిదిద్దిన విశాఖపట్నం గీతం వైద్యకళాశాలకు కూడా అభినందనలు’’ అంటూ మరో ట్వీటు ద్వారా తన కులపిచ్చిని ప్రదర్శించుకున్నారు.
స్వాతిరెడ్డి సమయానికి తగట్టు స్పందించడంలో ఆమె కాలేజీకి భజన చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. నిజానికి ఆ అమ్మాయి కేవలం ప్రసవం చేయడంతో ఊరుకోలేదు. ఆ తల్లీ బిడ్డ అనకాపల్లి స్టేషన్లో దిగి ఆస్పత్రికి వెళ్లగా, తన ప్రయాణం మధ్యలో విరమించుకుని, తాను కూడా వారికి సాయంగా వెళ్లింది. అంతటి మానవత్వాన్ని ప్రదర్శించింది.
జరిగింది ఇది కాగా.. చంద్రబాబునాయుడు మాత్రం.. పెయిడ్ కూలీలు.. ప్రమోషనల్ కామెంట్స్ చెప్పినట్టుగా.. ఈ ఘటనలో కీర్తిని కూడా తన కులం వారికి చెందిన గీతం కాలేజీకి దక్కేలా చేయాలని ఆరాటపడడం చూసి జనం అసహ్యించుకుంటున్నారు.
ఆ అమ్మాయి కమ్మ కులం అయితే.. కీర్తి మొత్తం ఆమెకే కట్టబెట్టే వారని.. రెడ్డి కులానికి చెందిన అమ్మాయి అయ్యేసరికి.. ఆ మంచిపనిలోని కీర్తిని.. కమ్మకులం కాలేజీకి కూడా పంచేయాలని ఆరాటపడుతున్నారని.. జనం చంద్రబాబు వైఖరిని ఈసడించుకుంటున్నారు.