తిరుమలేశుని దళార్ల నోట్లో మట్టి!

తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు.. అంతోఇంతో వీఐపీ దర్శనం పొందడానికి గల మార్గాలను నవీకరించనున్నారు. ఈ మేరకు టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. భగవంతుడి మీద భక్తి పొంగిపొరలే సంపన్నులు.. అంతో ఇంతో…

తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు.. అంతోఇంతో వీఐపీ దర్శనం పొందడానికి గల మార్గాలను నవీకరించనున్నారు. ఈ మేరకు టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. భగవంతుడి మీద భక్తి పొంగిపొరలే సంపన్నులు.. అంతో ఇంతో సమర్పణ భావంతో ఉండగలిగితే.. భారీగా కానుకలు చెల్లించుకోగలిగితే.. వారికి ప్రత్యేకమైన, ప్రాధాన్యం గల దర్శనం కూడా దొరుకుతుంది. ఆ మేరకు కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నారు. అయితే ఈ సరికొత్త విధానాల రూపకల్పన వలన.. తిరుమలేశుని దర్శనభాగ్యం కల్పించే పేరుతో.. దళారీల అవతారం ఎత్తుతుండే అనేకానేక మందికి నోట్లో మన్ను పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టీటీడీ ఆధ్వర్యంలో ఉండే శ్రీవాణి కార్యక్రమానికి భూరి విరాళాలు ఇచ్చేవారికి ఇక ప్రత్యేకదర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు దొరుకుతాయి. ఆల్రెడీ లక్ష విరాళం ఇచ్చేవారికి బ్రేక్ దర్శనం, పదిలక్షలు ఇచ్చేవారికి వీఐపీ బ్రేక్ దర్శనం, కోటి ఇచ్చేవారికి ప్రోటోకాల్ దర్శనం వంటి సదుపాయాలను కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా తిరుమల శ్రీవాణి కార్యక్రమానికి పదివేలు విరాళం ఇచ్చేవారికి బ్రేక్ దర్శనాలు కల్పించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై టీటీడీలో చర్చ జరిగింది. బోర్డు సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే ఇలాటి పద్ధతి అమల్లోకి వస్తే కొండ దళార్లకు నోట మట్టి పడుతుంది. మొన్నటిదాకా ఎల్ 1, ఎల్2 టికెట్ల పేరిట ఒక్కొక్క దానికి పదివేల నుంచి, పదిహేను వేల రూపాయల వరకు ధర పెట్టి అమ్ముకుంటూ సొమ్ముచేసుకునే దళారులు.. తిరుపతి తిరుమలలో పెచ్చరిల్లుతుండేవారు. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా, మంత్రుల సిఫారసు ఉత్తరాల్ని నిషేధించిన సీజన్లలో కూడా వీరి దళారీ వ్యవహారాలు మాత్రం యథేచ్ఛగా సాగుతుండేవి.

అయితే ఇలాంటి ఏర్పాట్లు రావడం వల్ల దళార్లకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. వారి ఆటలు సాగవు. వారి చేతుల్లో వేలవేల రూపాయలు ధారపోసేవారు.. మరికొంత ఎక్కువ మొత్తం చెల్లించి అయినా.. టీటీడీ వారి పథకానికి సొమ్ము చెల్లించి టికెట్లు తీసుకుంటారు. ఆ సొమ్మేదో స్వామికే చెల్లించినట్లు భావిస్తారు. అలాంటి నేపథ్యంలో టీటీడీలో ఈ నిర్ణయం గురించిన చర్చ జరుగుతున్నదన్న వార్తలన్నీ పుకార్లేనని, అంతా అబద్ధమనీ కూడా దళార్లు ప్రచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి నిర్ణయాలు రాకుండా.. బోర్డును ప్రభావితం చేయడానికి ప్రయత్నించినా ఆశ్చర్యంలేదు.

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది