సాధారణంగా ఒక పెద్ద హోదాలో పనిచేసిన వ్యక్తి దిగివచ్చి కింది హోదాలో పని చేయడానికి ఒప్పుకోడు. ప్రధానమంత్రిగా వారంరోజుల పాటు కూర్చున్న వ్యక్తి అయినా ఆ తర్వాత కేంద్రంలో ఐదేళ్లపాటు దక్కే మంత్రి పదవిని అయినా తీసుకోడు. ఉన్నత పదవిని అధిరోహించాకా దాని కిందిస్థాయి పదవిని తీసుకోవడానికి చాలామంది ఒప్పుకోరు. అందుకు బోలెడన్ని ఉదాహరణలు.
కొన్నినెలల పాటే దేశానికి ప్రధానిగా చేసిన దేవేగౌడ ఆ తర్వాత కర్ణాటకలో తన పార్టీకి సీఎం పీఠం అవకాశం వచ్చినా తీసుకోలేదు. తన తనయుడికి దాన్ని వదిలాడు. వారాలు, నెలలు కీలక పదవుల్లో ఉండి ఆ తర్వాత దిగువస్థాయి పదవులు వచ్చినా తీసుకోని వారు చాలామందే ఉన్నారు. మాజీ ప్రధానులు ఆ తర్వాత ఒట్టి ఎంపీలుగా మిగిలిపోయిన సందర్భాలున్నాయి.
రాజకీయ నేతల్లో ఏ విలువలు లేకపోయినా ఈ విలువలకు అయితే కట్టుబడుతూ వచ్చారు. అయితే తొలిసారి ఆ ముచ్చటను కూడా పక్కనపెట్టారు. కర్ణాటకలో ఈ చోద్యం జరిగింది. ఇదివరకూ కర్ణాటకకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగదీష్ షెట్టర్ ఇప్పుడు మంత్రిగా మారారు!
గతంలో కర్ణాటకలో యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన బీజేపీ వాళ్లు సదానంద గౌడకు ఆ అవకాశం ఇచ్చారు. ఏడాది తర్వాత సదానందగౌడను కూడా తప్పించి జగదీష్ షెట్టర్ కు అవకాశం ఇచ్చారు. అలా దాదాపు ఏడాది పాటు కర్ణాటక సీఎంగా కొనసాగారు షెట్టర్. ఆ తర్వాత జరిగిన ఎన్నికల సమయంలో యడియూరప్ప తిరుగుబాటుతో బీజేపీకి దెబ్బపడింది. కాంగ్రెస్ మంచి మెజారిటీతో ఐదేళ్ల అధికారాన్ని ఉపయోగించుకుంది.
అలా మాజీ సీఎం అనే ట్యాగ్ తో మిగిలారు షెట్టర్. సిద్దరామయ్యకు ముందు దాదాపు ఏడాది పాటు సీఎంగా చేశారాయన. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన యడియూరప్ప కేబినెట్లో మంత్రిగా మారారు! ఒక మాజీ ముఖ్యమంత్రి తిరిగి మంత్రి పదవిని చేపట్టడం చోద్యమే. రాజకీయ నేతలు ఇన్నాళ్లూ తమ హోదాల విషయంలో పాటించిన నియమాన్ని కూడా కర్ణాటక బీజేపీ వాళ్లు పక్కన పెట్టారు. మాజీ సీఎం అనే ట్యాగ్ కన్నా, ప్రస్తుత మంత్రి అనే హోదానే గొప్ప అనిపించినట్టుంది షెట్టర్ కు!