తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని అనేవారు ఎక్కువైపోయారు. అలాంటివారి మాటలను విన్నప్పుడు సహజంగానే తెలుగుదేశం నాయకులకు క్రోధం ముంచుకు వచ్చేస్తుండవచ్చు. అలాంటి వారి అభిప్రాయాలు తప్పని నిరూపించడానికే.. ఇప్పుడు తెతెదేపా సాహసిస్తోంది. తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక హుజూర్ నగర్ బరిలో దిగేందుకు నిర్ణయించుకుంది. తాము బలహీనపడ్డామని అంటున్న వారికి బుద్ధి చెప్పడానికే హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు తెదేపా నాయకులు అంటున్నారు.
అయితే ఇంతకూ వారు బుద్ధి చెప్తారా? బుద్ధి తెచ్చుకుంటారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా శల్యావశిష్టంగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో వారు పోటీచేయనేలేదు. అక్కడ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయన భార్య నిలబడుతోంది. చాలా మీనమేషాలు లెక్కించిన తర్వాత తెదేపా పోటీకి సిద్ధమౌతోంది.
పోటీ ద్వారా వారు సాధించేది ఏంటన్నది తెలియదు. కాకపోతే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతిలేక కాంగ్రెస్ తో కుదుర్చుకున్న బంధం పుటుక్కుమన్నట్లేనని వారు ప్రపంచానికి చాటి చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీచేస్తేనే ఉత్తంకుమార్ పదివేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా పోటీచేస్తే.. అంతోఇంతో తెరాస వ్యతిరేక ఓటును చీల్చుకోవడమే తప్ప మరొకటి జరగదు. భాజపా కూడా మరింత ఫోకస్ పెడితే.. తెరాస అభ్యర్థికి మరింత లాభం అవుతుంది.
తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుందని అంటున్న వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఎన్నికల్లోకి దిగుతోంది. కానీ ఎన్నికలు ముగిసేవేళకు ప్రజలు అనుకుంటున్నది నిజమేనని వారికే బుద్ధి వస్తుందేమో. కాంగ్రెసులో ముఠాలు లోపాయికారీగా పార్టీ అభ్యర్థికి చేటు చేస్తే తప్ప… తెదేపాకు కాసిని ఓట్లు రాగల అవకాశం తక్కువేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.