ఏపీ కేబినెట్ లో ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల భర్తీ ఈ నెల 22న జరగబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ముహూర్తం కుదిరిందని ఇది వరకే వార్తలు వచ్చాయి. 22వ తేదీ మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ సభ్యులుగా వెళ్లడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
ఆ స్థానంలో ఇద్దరు బీసీ నేతలకే అవకాశం దక్కనుందని సమాచారం. వాస్తవానికి పిల్లి, మోపిదేవిలు పదవులను ఏమీ కోల్పోలేదు. ఒకరకంగా ప్రమోషన్ దొరికింది. అయినప్పటికీ ఖాళీ అయ్యే రెండు సీట్లనూ బీసీలకే ఇస్తున్నారని స్పష్టం అవుతోంది. సీదిరి అప్పల్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు కొత్తగా మంత్రులు కాబోతున్నట్టుగా భోగట్టా.
ఇక జగన్ కేబినెట్లో మరింత మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. అయితే ఖాళీ అయిన రెండు పదవుల భర్తీకే సీఎం జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నారని స్పష్టం అవుతోంది. ఇప్పుడు జరిగేది కేబినెట్ విస్తరణ అని కొంతమంది నేతలు ఆశించారు. కొత్తగా విస్తరించేది ఏమీ లేక, కేవలం ఖాళీలు భర్తీ చేయడం లాగా ఉంది. దీంతో ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ తప్పనట్టుంది.