Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ఇద్ద‌రు ఎంపీలు రెడీ!

వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ఇద్ద‌రు ఎంపీలు రెడీ!

వైసీపీలో అభ్య‌ర్థుల ఎంపిక కాక రేపుతోంది. కోరుకున్న‌ట్టు టికెట్లు ద‌క్క‌క‌పోతే పార్టీకి గుడ్ బై చెప్ప‌డానికి కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు వెనుకాడ‌డం లేదు. ముఖ్యంగా సంప‌న్నులైన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీని వీడ‌డానికి వెనుకాడ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. డ‌బ్బున్న నేత‌ల‌కు ఇత‌ర పార్టీలు రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైసీపీని వీడేందుకు ఇద్ద‌రు ఎంపీలు మాన‌సికంగా సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు, అలాగే ఉమ్మ‌డి గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట ఎంపీలు మాగుంట శ్రీ‌నివాస్‌రెడ్డి, లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు వైసీపీని వీడేందుకు రెడీ అయ్యార‌ని స‌మాచారం. వాళ్లిద్ద‌రితో టీడీపీ పెద్ద‌లు ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలిసింది.

ఒంగోలు ఎంపీ సీటు త‌న కుమారుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డికి ఇవ్వాల‌ని శ్రీ‌నివాస్‌రెడ్డి కోరుతున్నారు. ఇందుకు సీఎం జ‌గ‌న్ స‌సేమిరా అన్న‌ట్టు తెలిసింది. శ్రీ‌నివాస్‌రెడ్డికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి కూడా ప‌ట్టు ప‌ట్టారు. కానీ జ‌గ‌న్ వీరి డిమాండ్ల‌ను ప‌ట్టించుకోలేదని స‌మాచారం. ఒంగోలు ఎంపీ బ‌రిలో త‌న చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని నిలిపేందుకు సీఎం నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో మాగుంట శ్రీ‌నివాస్‌రెడ్డి సైలెంట్‌గానే త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. మాగుంట‌కు అన్ని పార్టీల నేత‌ల‌తో సత్సంబంధాలున్నాయి. మంచి వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరు వుంది. మరీ ముఖ్యంగా బాగా డ‌బ్బున్న నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న్ను చేర్చుకునేందుకు టీడీపీ ఉత్సాహం చూపుతోంది.

ఇదిలా వుండ‌గా న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు కూడా వైసీపీని వీడే అవ‌కాశాలే ఎక్కువ‌. లావు శనివారం మీడియాతో పంచుకున్న అభిప్రాయాల్ని గ‌మ‌నిస్తే, కేవ‌లం సాకు కోసం ఎదురు చూస్తున్నార‌ని చెప్పొచ్చు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను శుక్ర‌వారం క‌లిసిన‌ట్టు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు చెప్పారు. గుంటూరు నుంచి పోటీ చేయాల‌ని సీఎం కోరార‌న్నారు. అయితే తాను మాత్రం న‌ర‌సారావుపేట నుంచే పోటీ చేస్తాన‌ని సీఎంకు చెప్పిన‌ట్టు తెలిపారు. వైసీపీ అధిష్టానం నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.  

వైసీపీ అధిష్టానం లేదా సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తాన‌ని శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు చెప్ప‌క పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఎంపీగా శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు సొంత నిధుల‌ను సైతం ఖ‌ర్చు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ పొందార‌ని స‌మాచారం. అంతేకాకుండా, కేంద్రం నుంచి నిధులు తెప్పించి మంచి పేరు తెచ్చుకున్నార‌ని తోటి ఎంపీలు అత‌ని గురించి చెబుతున్నారు. అలాంటి ఎంపీని ఎందుకు మార్చాల్సి వ‌స్తున్న‌దో తెలియ‌దు కానీ, వైసీపీ అధిష్టానం వైఖ‌రితో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు విసిగిపోయిన‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు. దీంతో వైసీపీని వీడేందుకు ఆయ‌న సాకు కోసం ఎదురు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?