Advertisement

Advertisement


Home > Politics - Andhra

నెల్లిమర్లలో కూటమికి అదే మైనస్?

నెల్లిమర్లలో కూటమికి అదే మైనస్?

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ కూటమి తరఫున జనసేన పోటీలో ఉంది. జనసేన నుంచి మహిళా అభ్యర్ధి లోకం నాగ మాధవి బరిలో ఉన్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి గెలిచేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. వైసీపీకి నెల్లిమర్ల 2019లో మంచి మెజారిటీ ఇచ్చింది. ఈసారి అదే రిపీట్ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

టీడీపీ కూటమి నుంచి జనసేనకు టికెట్ ఇవ్వడం వల్ల కూటమి కష్టాలు ఎక్కువ అవుతున్నాయని  ప్రచారంలో ఉంది. టికెట్ ఆశించి భంగపడిన తెలుగుదేశం నాయకులు అధినాయకత్వం బుజ్జగింపుతో దారికి వచ్చినట్లుగా కనిపిస్తున్నా చివరి నిముషం వరకూ వారు పూర్తిగా సహకరించాల్సిన అవసరం అయితే ఉంది.

నెల్లిమర్లలో జనసేన పూర్తిగా టీడీపీ మీదనే ఆధారపడి ఉంది. టీడీపీ నుంచి రావాల్సిన సాయం రావడంలేదు అని అంటున్నారు. నాయకులు తిరుగుతున్నా క్షేత్ర స్థాయిలో క్యాడర్ కూడా కలసిపోవడం లేదు అని అంటున్నారు. నెల్లిమర్లలో చూస్తే బలమైన కాపు సామాజికవర్గం ఉంది. ఆ ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉంటాయి.

ఆ ఓటే తమకు కాపు కాస్తాయని వైసీపీ కోటి ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతోంది. వైసీపీలో చూస్తే వర్గ పోరు హెచ్చు స్థాయిలోనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తో విభేదాల వల్ల కొందరు ఇప్పటికే జనసేనలోకి చేరిపోయారు. మిగిలిన వారిని నచ్చచెప్పి ఉంచుకున్నా వారు పూర్తిగా సహకరించాల్సి ఉంది.

ఇలా చూస్తే రెండు పార్టీలలోనూ ఇబ్బందులు ఉన్నా వైసీపీకి కుల సమీకరణలు బాగా అడ్వాంటేజ్ అవుతాయని అంటున్నారు. చివరి నిముషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప వైసీపీకి ఇక్కడ బలమైన సామాజిక వర్గం అండదండలతో నెగ్గుతుందని ఒక అంచనా. అయితే గతసారి వచ్చినంత మెజారిటీ రాదని గట్టెక్కడం మాత్రం ఖాయమని అంటున్నారు.

టీడీపీ తనకు బలమైన సీటుని చేజార్చుకోవడం వల్లనే ఈ పరిణామాలు అని అంటున్నారు. ఇక్కడ మొదట్లో నెమ్మదిగా ఉన్న జనసేన ఇప్పుడిప్పుడే జోరు అందుకుంది. కానీ అది గెలుపు తీరం చేర్చేటంత వేగంగా లేదు అన్నది విశ్లేషణగా ఉంది. సులువుగా గెలిచేస్తామన్న పరిస్థితి నుంచి వైసీపీలో టెన్షన్ పుట్టించడంలో మాత్రం జనసేన సక్సెస్ అయింది. అనూహ్య పరిణామాలు జరుగుతాయని సేన కార్యకర్తలు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?