పాక్ ముఖప్రీతికే ఐరాస సమావేశం!

కాశ్మీరు వ్యవహారం పూర్తిగా తమ దేశపు అంతర్గత విషయం అని బలంగా నమ్ముతున్న భారత్ మాత్రం నిమ్మళంగా, నిశ్చలంగా ఉంది. అయితే ఈ అంశాన్ని రచ్చకీడ్చడం ద్వారా.. ఏదో అనుచితమైన లబ్ధిని ఆశిస్తున్న పాకిస్తాన్…

కాశ్మీరు వ్యవహారం పూర్తిగా తమ దేశపు అంతర్గత విషయం అని బలంగా నమ్ముతున్న భారత్ మాత్రం నిమ్మళంగా, నిశ్చలంగా ఉంది. అయితే ఈ అంశాన్ని రచ్చకీడ్చడం ద్వారా.. ఏదో అనుచితమైన లబ్ధిని ఆశిస్తున్న పాకిస్తాన్ మాత్రం.. గొడవ గొడవ చేసేస్తోంది. అందులో భాగంగానే.. ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ ఒక విడత భంగపడింది. మొత్తానికి, ఇప్పుడు ఈ అంశంపై- ఐక్యరాజ్యసమితి దేశాలు ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించాయి. కేవలం సమావేశం మాత్రమే జరిగింది… చర్చల సారాంశం ఏమిటో కనీసం ప్రకటన చేయడానికి కూడా ఐరాస నిరాకరించింది.

ఈ వ్యవహారం మొత్తాన్ని గమనించినప్పుడు.. అంతా పాకిస్తాన్ ముఖప్రీతి కోసమే జరిగినట్లుగా ఉంది. కాశ్మీర్‌పై భారత్ నిర్ణయం తీసుకున్నప్పుడే.. భద్రతామండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా ఐరాసను పాకిస్తాన్ కోరింది. ఈ వినతిని ఐరాస తిరస్కరించింది. అయితే పాకిస్తాన్ చైనాకు లేఖ రాసింది. ఐరాస సభ్యదేశమైన చైనా కూడా సమావేశం నిర్వహించాల్సిందిగా కోరడంతో.. శుక్రవారం నాటి సమావేశం జరిగింది.

అయితే దీనిని భద్రతా మండలి అధికారిక సమావేశంగా కాకుండా, కేవలం ఇష్టాగోష్టి సమావేశంగా మాత్రమే నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత.. ఐరాస కనీసం ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ సమావేశంలో 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్, పాక్ లకు చెందిన ప్రతినిధులను అనుమతించలేదు. తమ ప్రతినిధిని కూడా సమావేశానికి అనుమతించాలని కోరి, పాకిస్తాన్ భంగపడింది.

ఈ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి పాకిస్తాన్ తనవంతు ప్రయత్నాలు చాలానే చేసింది. చైనాతో ఉన్న సత్సంబంధాల ద్వారా సమావేశం ఏర్పాటు చేయించడం మాత్రమేకాదు, ఆ సమావేశానికి తమ ప్రతినిధిని అనుమతించాలని కోరి విఫలమైంది. మరోవైపు సమావేశానికి ముందే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేసి, మండలి సమావేశంలో వారి వాదనలను ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నించారు.

అయితే ఈ సమావేశం కేవలం.. ఏం జరుగుతున్నదో అన్ని దేశాలూ తెలుసుకోవడం కోసం నిర్వహించినదే తప్ప… దీనికి ఇతరత్రా ప్రాధాన్యం లేదని సభ్యులు కొందరు అభిప్రాయపడ్డారు. సాధారణంగా సమావేశం ముగిసిన తర్వాత.. భద్రతా మండలి తీర్మానం చేయాలి. కానీ అలాంటి అవసరం లేకుండా… ఈ భేటీని అధికారిక సమావేశం ముద్రతో కాకుండా, ఇష్టాగోష్టి సమావేశం ముద్రతో నిర్వహించారు. సమావేశం తర్వాత.. కనీసం ప్రకటన కూడా చేయలేదు.

ప్రకటనలో వాడే భాష, అందులోని పదజాలం  కూడా కాశ్మీర్ సమస్యపై ఉద్రిక్తతలను రెచ్చగొట్టవచ్చుననే అభిప్రాయం సభ్యదేశాల్లో వ్యక్తం కావడంతో.. సమావేశాల కనీస లాంఛనం అయిన ప్రకటన కూడా చేయకుండానే ముగించారు. ఏ రకంగా చూసినా.. ఏదో పాకిస్తాన్ ముఖప్రీతికోసం సమావేశం నిర్వహించినట్లుగా కనిపిస్తోంది.

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే