జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిల పరిస్థితేంటి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది కోరుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయన సోదరి షర్మిల మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కేవలం కోరుకోవడం కాదు, జగన్ కోసం ఎన్నో…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది కోరుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయన సోదరి షర్మిల మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కేవలం కోరుకోవడం కాదు, జగన్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డారామె. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అంటూ ప్రచారం హోరెత్తించారు. అలా మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున కీలకపాత్ర పోషించారు. మరి జగన్ సీఎం అయితే షర్మిలకు సముచిత స్థానం కల్పిస్తారా?

ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే షర్మిలకు సముచిత స్థానం కల్పించాల్సిందేనంటూ పట్టుబడుతోంది పార్టీలో ఓ వర్గం. నిజానికి ఎన్నికల టైమ్ లోనే షర్మిల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెకు ఏదో ఒక స్థానం కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా ఒంగోలు లోక్ సభ నుంచి షర్మిల పోటీచేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కానీ జగన్ మాత్రం షర్మిలకు సీట్ ఇవ్వలేదు.

తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినా షర్మిల మాత్రం జగన్ కోసం పనిచేశారు. రాష్ట్రంలో జగన్ కవర్ చేయలేని ప్రాంతాల్లో చురుగ్గా పర్యటించారు. “బై..బై బాబు.. బై..బై.. పప్పు” అనే స్లోగన్ ను తెరపైకి తీసుకొచ్చింది కూడా షర్మిలే. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ స్లోగన్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అన్నను గెలిపించుకోవాలని, ఓటు వేసేముందు రాజన్నను గుర్తుచేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారామె.

కేవలం ఈ ఎన్నికల్లోనే కాదు, గత ఎన్నికల్లో కూడా అన్న జగన్ కోసం షర్మిల చాలా కష్టపడ్డారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంతకు ముందు కూడా జగన్ పై అక్రమంగా కేసులు బనాయించి, జైలులో పెట్టినప్పుడు పార్టీ కోసం ఎంతో శ్రమించారు. పార్టీలో చీలికలు రాకుండా అన్నీ తానై ముందుకు నడిపించారు.

ఇలా వైసీపీ ప్రస్థానంలో తనదైన ముద్రవేసిన షర్మిలకు, వైసీపీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వంలో చోటు కల్పించాల్సిందేనని చాలామంది పట్టుబడుతున్నారు. బాబు సర్కార్ లో లోకేష్, బాలయ్య ఉన్నట్టు.. కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్, కవిత ఉన్నట్టు.. జగన్ కొత్త కొలువులో షర్మిల ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన జగన్, సోదరి షర్మిలపై ఎలాంటి ఆలోచనతో ఉన్నారో ఇంకా బయటపడలేదు.

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి అనుకూలత ఉన్నట్టే..