దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని 'దర్శకుల దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో. ఆ సంగతి పక్కన పెడితే, దాసరి జయంతి సందర్భంగా ఓ వేదికపై సినీ నటుడు, నిర్మాత మోహన్‌బాబు, దాసరి ఆస్తుల పంపకానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆస్తుల పంపకాల బాధ్యతను దాసరి, తనకూ అలాగే మురళీమోహన్‌కీ అప్పగించారన్నది మోహన్‌బాబు ఉవాచ. కానీ, ఆ పంపకాల ప్రక్రియ సరిగ్గా చేపట్టలేకపోయామనీ, అందుకు వేరే కారణాలున్నాయనీ మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.
అసలిక్కడ, దాసరి నారాయణరావు అస్తుల పంపకాల వ్యవహారం ఎందుకు చర్చకు వచ్చింది.? ఏమో మరి, మోహన్‌బాబుకే తెలియాలి. నిజానికి, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు చాలాకాలంగానే వున్నాయి.
ఆ మాటకొస్తే, కుటుంబం అన్నాక ఇలాంటి సమస్యలు మామూలే. అయినాసరే, దాసరి నారాయణరావు అంటే దర్శకరత్న.. పైగా, తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దన్న. టాలీవుడ్‌లో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ముందుగా దాసరి దగ్గరకే వెళ్ళేవారు.
దాసరి మరణానంతరం, 'తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయింది.. దాసరి లేకపోవడంతో, సినీ పరిశ్రమలో ఎవరి ఇష్టానికి వారు వ్యవహరిస్తున్నారు..' అనే కామెంట్స్‌ని తరచూ వింటున్నాం. దాసరికి సినీ పరిశ్రమలో అంతటి గౌరవం వుంది. అదే సమయంలో దాసరి కుటుంబ వివాదాలూ అందరికీ తెలుసు. అయినాగానీ, దాసరి గౌరవానికి ఏనాడూ భంగం కలగలేదు.. కుటుంబ సమస్యల కారణంగా.
మరి, అలాంటప్పుడు దాసరి శిష్యుడని చెప్పుకునే మోహన్‌బాబు, దాసరి ఆస్తుల పంపకాల వ్యవహారం గురించిన ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.
అన్నట్టు, మోహన్ బాబు ఆ మధ్య తిరుపతిలో తన విద్యా సంస్థల యెదుట ధర్నా చేయడం.. ఆ వెంటనే, దాసరి కోడలు మీడియా ముందుకొచ్చి, మోహన్ బాబు తన కుటుంబానికి అన్యాయం చేశారని వాపోవడం తెల్సిన విషయాలే. ఆ విమర్శల నేపథ్యంలోనే మోహన్ బాబు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసి వుండొచ్చుగాక.. కానీ, దాసరి జయంతి రోజున, ఆస్తుల పంపకాల ప్రస్తావన ఏమాత్రం సబబుగా లేదన్నది నిర్వివాదాంశం.