Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఒప్పుకుంటే ఆహ్వానం... లేకుంటే బెదిరింపు!

ఒప్పుకుంటే ఆహ్వానం... లేకుంటే బెదిరింపు!

మోదీ సర్కార్ తమ అసలు ముద్ర ఏమిటో చూపించే ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతంగా చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని తమలో కలిపేసుకోవడం అనేది చాలా చిన్న స్టెప్ మాత్రమే. ముందుముందు ఇలాంటి పరిణామాలు ఇంకా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని డిల్లీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.

అందితే  జుట్టు...  అందకుంటే కాళ్లు అనే సామెత ఇప్పుడు పాతబడిపోయింది. ఇదంతా అవకాశవాదుల సంగతి. దీనికి రివర్సులో ఇప్పుడు బీజేపీ వ్యూహం సాగుతోంది. ఉన్న పార్టీలను వీడి తమ పార్టీలోకి రావడానికి నాయకులు ఒప్పుకుంటే సాదరంగా ఆహ్వానించడం, ఒప్పుకోకుంటే ఏదో ఒక రీతిలో బెదిరించడం అనేది వారి మార్కుగా ఉంటోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది. రాజకీయ నాయకులు అనే జాతి యావత్తూ ఇప్పుడు వ్యాపారుల మయం అయిపోయింది.

వ్యాపారంతో ముడిపడిన వారే ప్రజాప్రతినిధులు అవుతుండడమే తడవు.. ఇక వారి జుట్టు ప్రభుత్వం చేతుల్లో చిక్కుతున్నట్లే. ఆయా వ్యాపారాలకు సంబంధించి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం సునాయాసమైన విద్య అయిపోతోంది. పైగా కించిత్ అక్రమాలకు పాల్పడకుండా వ్యాపారం చేసేవాళ్లంటూ ఎవ్వరూ లేరు! ఆ ఆనుపానులను భాజపా దొరకబుచ్చుకుంటోంది.

తాజాగా తెదేపా నుంచి ఫిరాయించిన నలుగురు ఎంపీలు కూడా వ్యాపార ప్రముఖులే. పన్ను ఎగవేత, ఐటీ, ఆర్థిక నేరాలు, రుణాల ఎగవేత వంటి వ్యవహారాల్లో వాళ్లు నిందితులు. వారి మీద సోదాలు నడిచాయి. కేసులు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే వారు పార్టీ మారడమూ జరిగింది. ఈ సిరీస్ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇదే తరహాలో.. దేశంలోని ఇంకా అనేక మంది ఇతర పార్టీల నాయకుల్ని తమలో కలిపేసుకునే దిశగా కమలదళం ప్లాన్ చేస్తున్నదని సమాచారం.

త్వరలో జరగబోతున్న భారీ మార్పు కర్నాటకలో అధికార బదలాయింపు అవుతుంది. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్- జనతాదళ్ ల నడుమ లుకలుకలు బయటపడుతున్నాయి. కుమార సర్కారును కూల్చేస్తాం అని కాషాయనాయకులు అంటున్నారు. ఇప్పటికే స్కెచ్ సిద్ధమైందని.. త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?