రాయలసీమలో (కర్నూలులో) హైకోర్టును ఏర్పాటు చేయాలని… రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటుచేసి.. సమతుల్య అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంలో భాగంగా… రాయలసీమకు కూడా అనల్ప ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పుడు కొత్త స్వరాలు వినిపిస్తున్నాయి.
రాయలసీమకు హైకోర్టు మాత్రమే కాదు.. ఏకంగా రాజధానినే ఇవ్వాలంటూ.. కొందరు కొత్త వాదన లేవదీస్తున్నారు. అయితే రాయలసీమకు అసలేమీ లేకుండా.. ద్రోహం చేసిన చంద్రబాబు పాలన సాగిన అయిదేళ్లూ మౌనంగా కూర్చున్న ఈ మేధావులు.. ఇప్పుడు ఎంతో కొంత న్యాయం చేయడానికి పూనుకుంటున్న జగన్ పాలనలో.. ఇలా భిన్న స్వరాలు వినిపించడం మాత్రం… దురుద్దేశాలతో కూడుకున్నదే అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడే.. కర్నూలు రాజధానిగా అయింది. తిరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు.. రాయలసీమ వాసులు తమ రాజధాని హోదాను త్యాగం చేశారు. ఇప్పుడు సీమ మేధావులు, జవసత్వాలు ఉడిగిపోయిన రాజకీయ నాయకులు కలిసి కట్టుగా.. ఆ విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు. దాంతో పాటూ.. రాజధానిని సీమకు తీసుకురావలని, న్యాయం చేయాలని అంటున్నారు. మరి సీమకు న్యాయం జరగాలనే అంత బలీయమైన వాంఛ ఉన్నప్పుడు వాళ్లు ఇన్నాళ్లూ ఎందుకు మౌనం పాటిస్తూ వచ్చారు. రాజకీయ ప్రేరేపితంగా.. జగన్ ను ఇరుకున పెట్టడానికి లేదా, తాము కూడా ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా కనపడడానికి ఈ మాటలు చెబుతున్నట్టున్నదే తప్ప.. చిత్తశుద్ధితో అంటున్నట్టు లేదు.
రాజకీయంగా ఖాళీగా మారిన కొందరు నాయకులు మైసూరా రెడ్డి, శైలజానాధ్, చెంగారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, ఆంజనేయరెడ్డి దినేష్ రెడ్డి లాంటి వాళ్లు దీనిపై సంతకాలు చేస్తున్నారు. సీమకు పూర్తిగా అన్యాయం చేసిన చంద్రబాబు పాలనలో ఊరక కూర్చుండిపోయి.. ఏదోటి చేయాలనుకుంటన్న జగన్ పాలనలో.. హర్షం వ్యక్తం చేయడానికి బదులుగా.. అడ్డు పుల్లలు వేస్తున్న ఇలాంటి వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు.