జనసేన పార్టీ ఈ నెల 30వ తేదీన ఓ సమావేశం పెట్టుకోనుందట. అది పార్టీ విస్తృతస్థాయి సమావేశమట. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన సహా, పలు ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందట. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది జనసేన పార్టీ. సోషల్ మీడియాలో జనసైనికులు నిరుత్సాహపడుతున్న దరిమిలా, పార్టీ తరఫున ఏదో ఒక యాక్టివిటీ వుందనిపించుకోవడానికి తప్ప.. ఈ ప్రెస్‌నోట్‌లో ఆసక్తికరమైన విషయమేమీ లేదు.
నిజానికి, మూడు రాజధానుల అంశంలో జనసేన పార్టీ క్లీన్ బౌల్డ్ అయిపోయింది. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విసిరిన బౌన్సర్ కారణంగా కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యుత్సాహమే ఆ పార్టీ కొంప ముంచింది. ఒకరకంగా చెప్పాలంటే, ఇది క్లీన్ బౌల్డ్ అనడం కంటే, హిట్ వికెట్ అనడం కరెక్టేమో. అసెంబ్లీలో ఇలా వైఎస్ జగన్ మూడు రాజధానులు వుండొచ్చు.. అని అన్నారో లేదో, జనసేన అధినేత ఎడా పెడా ట్వీట్లు వేసేశారు.!
అంతే, జనసేన శ్రేణులు షాక్‌కి గురయ్యాయి. ఆ తర్వాత ఒక్కసారిగా జనసేనాని నుంచి ట్వీట్ల పర్వం ఆగిపోయింది. జనసేన పార్టీలో స్తబ్దత నెలకొంది. చివరికి 'ఈ నెల 27న క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాత స్పందిస్తాం..' అని జనసేన పార్టీ ఓ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ ప్రకటనతో జనసేన పార్టీ మరింత నైరాశ్యంలో మునిగిపోయింది. ఇప్పుడీ 'విస్తృత స్థాయి' సమావేశంతో జనసేన పార్టీ ఏం సాధిస్తుంది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కాస్త ఆగి, ఆలోచించి.. మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించి వుంటే.. కాస్తో కూస్తో ఆ పార్టీకి అది రాజకీయంగా కలిసొచ్చేది.. పవన్ కళ్యాణ్ మీద కాస్తో కూస్తో గౌరవం జనానికి పెరిగేది. యధా చంద్రబాబు, తధా పవన్ కళ్యాణ్.. అన్నట్లుగా జనసేనాని తీరు వుండడంతో.. ఇకపై భవిష్యత్తులో జనసేన పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమే అన్న పరిస్థితి దాపురించేసింది.