‘నిజానికి ‘పాలనా’ రాజధానిని ప్రభుత్వమే నిర్మించుకోవాలి; ‘జన’ రాజధానిని జనం నిర్మించుకోవాలి. కానీ, ‘ప్లాంటింగ్ ఆఫ్ కేపిటల్’ అనే ప్రక్రియ ద్వారా పాలనా రాజధానిని, జన రాజధానిని ప్రభుత్వమే ఒకేచోట నిర్మించాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇదంతా జనాన్ని మభ్యపెట్టి భూవ్యాపారం సజావుగా జరుపుకోవడానికి పన్నిన పన్నాగమే’
ఈ వాక్యాలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విమర్శలు కావు.
‘లెజిస్లేటివ్ రాజధాని ఒక రీజియన్‌లో, అడ్మినిస్ట్రేటివ్ కం ఎగ్జిక్యూటివ్ రాజధాని మరో రీజియన్‌లో, జ్యుడిషీయల్ రాజధాని ఇంకొక రీజియన్‌లో నెలకొల్పడంతో మూడు ప్రాంతాల వాసుల్ని సంతృప్తిపరచినట్టు అవుతుంది’…ఇది జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడానికి నెల ముందే సమాజం ముందు పెట్టిన ఓ ఆలోచన.
పైన పేర్కొన్నవి, ఈ ఏడాది నవంబర్ 9న ‘సాక్షి’ దినపత్రిక ఎడిట్ పేజీలో ‘మూడు రాజధానులతో రగడ తీరేనా?’ శీర్షికతో అచ్చయిన వ్యాసంలోని కొన్ని పాయింట్లు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ (చరిత్ర) డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి చరిత్రపై పరిశోధించి దాదాపు 24 పుస్తకాలు ఇంగ్లీష్, తెలుగులోనూ రాశారు. రాయలసీమ వెనుకబాటుతనంపై ఆయన అనేక వ్యాసాలను పలు పత్రికల్లో రాశారు, రాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని సీఎం జగన్ ఈ నెల 17న అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దక్షిణాప్రికాలో మూడు రాజధానులను ప్రస్తావించారు. అంతేకాదు లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ కం ఎగ్జిక్యూటివ్, జ్యుడిషీయల్ రాజధానులంటూ అమరావతి, విశాఖ, కర్నూల్ ప్రాంతాల గురించి ప్రస్తావించారు. సీఎం ఆలోచనలకు తగ్గట్టుగానే డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి వ్యాసంలోని అంశాలు కూడా ఒకేలా ఉండడం యాధృచ్ఛికమా లేక జగన్ వాటిని పరిగణలోకి తీసుకొని ఉండొచ్చనే అభిప్రాయం కలుగుతోంది.
అక్టోబర్‌లో సాక్షికి వ్యాసం పంపిన దేవిరెడ్డి
‘రాజధాని రగడ మూడు రాజధానులు ఏర్పాటుతో అంతం’ శీర్షికతో విశ్రాంత చరిత్ర ఆచార్యుడు డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో సాక్షి దినపత్రికకు రెండు పేజీల వ్యాసం పంపారు. అలాగే సబ్‌హెడ్డింగ్స్‌గా లెజిస్లేటివ్ కేపిటల్, ఎగ్జిక్యూటివ్ -కం- అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్, జ్యుడీషియల్ కేపిటల్ అని ఆయన పెట్టారు. పత్రికలో నిడివి సమస్య దృష్ట్యా దేవిరెడ్డి పంపిన వ్యాసంలోని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ‘మూడు రాజధానులతో రగడ తీరేనా?’ శీర్షికతో గత నెల 9న ఎడిట్ పేజీలో ప్రచురించారు.
దేవిరెడ్డి రాసిన వ్యాసంలో జగన్ ప్రస్తావించిన దక్షిణాప్రికా మూడు రాజధానుల ఉదాహరణతో పాటు అనేక రాజధానుల సమాచారాన్ని కూడా ఇచ్చారు. దేవిరెడ్డి వ్యాసంలోని ముఖ్యమైన అంశాలు ‘గ్రేటాంధ్ర’ పాఠకుల కోసం…
అత్యధిక జనామోదంతో, ప్రజాస్వామ్యయుతంగా రాజధాని మార్పు చేసినంత మాత్రాన నేటి రాజధాని ప్రాంతంలో ఏదో నష్టం జరిగిపోతుందని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఒళ్లు పులకరించే రీతిలో వాణిజ్య పంటలతో వ్యవసాయ పరంగా అత్యంత పురోగతిలో ఉన్నరాజధాని ప్రాంతంలో పారిశ్రామిక, సేవల రంగాన్ని కూడా స్థాపించడానికి చర్యలు తీసుకున్నట్టైతే ఆ ప్రాంతం అభివృద్ధి సాధించే అవకాశం ఉంది.
రాజధానులు మార్పులు జరిగినా అభివృద్ధి కొనసాగడం చరిత్రలో పలు రాజధానుల విషయంలో కనిపిస్తోంది. అంతేగాక, ఒకే రాజధానిని గాని, రెండు మూడు రాజధానులను గాని కలిగిన, కలిగి ఉండిన రాష్ట్రాలు, దేశాలు, రాజ్యాలు కూడా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు మహారాష్ట్రకు రెండు రాజధానులున్నాయి. ఒకటి ముంబైలో, మరొకటి నాగపూర్‌లో. హిమాచలప్రదేశ్‌కూ రెండు ఉన్నాయి. ఒకటి సిమ్లాలో, మరొకటి ధర్మస్థలలో. జమ్మూకాశ్మీర్‌కు సమ్మర్ కేపిటల్‌గా శ్రీనగర్, వింటర్ కేపిటల్‌గా జమ్మూ ఉండేవి.
దక్షిణాప్రికా దేశానికి మూడు రాజధానులున్నాయి. అవి ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లొఎమ్‌ఫోన్టీన్. ప్రిటోరియా అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా, కేప్‌టౌన్ లెజిస్లేటివ్ కేపిటల్‌గా , బ్లొఎమ్‌ఫోన్టీన్ జ్యుడీషియల్ కేపిటల్‌గా ఉన్నాయి. శ్రీలంకకు శ్రీజయవర్ధనేపురకోట్టె అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా , కొలంబో జ్యుడీషియల్ అండ్ కమర్షియల్ కేపిటల్‌గా ఉన్నాయి. మలేషియాకు కౌలాలంపూర్ అఫీషియల్ రాజధానిగా, పుత్రజయ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా ఉన్నాయి. ఛీలీకి అఫీషియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడీషియల్ కేపిటల్‌గా శాంటియాగో ఉండగా, లెజిస్లేటివ్ కేపిటల్‌గా వల్పరైజో ఉంది. ఇలా చాలా దేశాలున్నాయి.
ఇక మనదేశ రాజ్యాల చరిత్రలోకి వెళితే , పల్లవులు తొలుత పల్నాడు ప్రాంతంలో రాజధానిని కలిగి ఉండి, ఆ తర్వాత దక్షిణానికి జరిగి నేటి చెన్నైరెడ్‌హిల్స్ సమీప పులాల్‌ను రాజధానిగా చేసుకుని , అటు తర్వాత కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. అలాగే తిరుపతి పరిసరాలని పాలించిన తొండైమాన్ అనే తిరైయ్యన్ నారాయణవణాన్ని రాజధానిగా కలిగి ఉంటూనే నెల్లూరు జిల్లా గూడూరు తాలూకాలోని రెడ్డిపాళెం అనే ఒకప్పటి పావత్తిరిని రెండో రాజధానిగా కలిగి ఉన్నారు. చోళులు కొంతకాలం ఉరియూరును , మరికొంత కాలం తంజావూరును రాజధానులుగా ఏర్పాటు చేసుకుని పాలించారు.
ఓయసలుల చివరి పాలకుడైన మూడో వీరభల్లాలుడు (1292-1345) కన్నడ ప్రాంత ఓయసలుల రాజ్య భాగానికి పాలకుడిగా ఉంటూ బేలూరు-హలేబీడులను రాజధానులుగా కలిగి క్రీస్తు శకం 1328 నుంచి తిరువణ్ణామలైని శాశ్వత రాజధానిగా చేసు కున్నారు. తమిళ ప్రాంత ఓయసల రాజ్య భాగానికి కన్ననూరు వద్దగల విక్రమసింహపురి , సేలం జిల్లాలోని బారామహల్ ఉత్తరాన ఉండిన కుందాని రాజధానులుగా ఉండేవి. విజయనగర చక్రవర్తులు హంపీ నుంచి పెనుగొండకు, తర్వాత చంద్రగిరికి , ఆ తర్వాత వెల్లూరుకు, తిరిగి చంద్రగిరికి రాజధానిని మార్చుకున్నారు.
రెడ్డిరాజులు అద్దంకి , కొండవీడు, రాజమహేంద్రవరంలను రాజధానులుగా ఏర్పాటు చేసుకుని పాలించారు. కడవలు, కడవరాయళ్లు అనే సామంత పల్లవులు (చోళుల సామంతులు) దక్షిణ ఆర్కాట్‌లో ఉండిన కూడల్ అని పిలుచుకునే కడలూరును , తర్వాత సెందమంగళాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. శంభువరాయళ్లు అనే వంశీయులు తిరువళ్లం, విరించిపురంలను రాజధానులుగా పాలార్‌నదీ ప్రాంతంలో పాలించారు.
తెలుగువారి ఆధునిక కాలపు రాజధాని మద్రాస్ నుంచి కర్నూల్‌కు , అక్కడి నుంచి హైదరాబాద్‌కు, ఇప్పుడు అమరావతికి మార్చుకున్నారు. నైజాంలు ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు రాజధానిని మార్చుకున్నారు. ఆంగ్లేయులు కలకత్తాను వదిలి ఢిల్లీని రాజధానిగా చేసుకున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా అనేకం జరిగాయి. ఇలా జరగడానికి ఆయా రాజధానుల ప్రాంతాల్లోని పరిస్థితులే కారణం.
నేటి వెలగపూడి-అమరావతి పరిస్థితులు కూడా నేటి ఏపీ రాజధాని విషయంలో కొత్త ఆలోచనలు జనంలో పుట్టుకొచ్చేట్టు చేస్తున్నాయి. కొందరు రాజధానిని మరొక చోటకు మార్చాలంటున్నారు. కొందరు ముఖ్యంగా, భూవ్యాపారం సాగించిన వారు రాజధానిని మార్చరాదంటున్నారు. ఇంకొందరు రెండు మూడు రాజధానులు ఏర్పరచుకుంటే రాష్ట్ర సమగ్రత, అభివృద్ధికి మంచిదంటున్నారు.
వికేంద్రీకరణకు బలమిచ్చినట్టు అవుతుందంటున్నారు. చివరి ఆలోచన సాధ్యమనిపిస్తోంది. లెజిస్లేటివ్ రాజధాని ఒక రీజియన్‌లో , అడ్మినిస్ట్రేటివ్ కం ఎగ్జిక్యూటివ్ రాజధాని మరో రీజియన్‌లో, జ్యుడిషీయల్ రాజధాని ఇంకొక రీజియన్‌లో నెలకొల్పడంతో మూడు ప్రాంతాల వాసుల్ని సంతృప్తిపరచినట్టు అవుతుంది.
దేవిరెడ్డి ఎంతో ముందు చూపుతో భవిష్యత్ మార్పులను అంచనా వేసి రాసినట్టుగానే ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. సాక్షికి పంపిన వ్యాసం బహుశా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యయనం చేసినట్టుగా ఆయన చేపట్టే మార్పులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మూడురాజధానుల మేధో సృష్టికర్త తిరుపతి నివాసి , రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి అంటే అతిశయోక్తి కాదేమో.
సొదుం రమణారెడ్డి