సహజంగా ఎవరైనా ఎన్నికల్లో ఓడిన తర్వాత కాస్త సమయం తీసుకుంటారు. తమ ఓటమికి కారణాలేంటో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమీక్షిస్తారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ నెమ్మదిగా ముందడుగు వేస్తారు. కాని జనసేనాని పవన్ మాత్రం ఇందుకు రివర్స్. ఆయన రూటే సపరేటు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చాలా యాక్టీవ్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఆయన రెండింతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు, పోరాటాలు చేస్తున్నాడు. సీఎం జగన్‌పై అనునిత్యం మాటల దాడి చేస్తున్నాడు. ఉంటే ప్రజాక్షేత్రంలో లేదంటే ట్విటర్‌లో. వేదిక ఏదైనా అంతిమంగా జగనే టార్గెట్.
రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకంటూ కాకినాడలో గురువారం ఆయన రైతు సౌభాగ్యం పేరుతో ఒక్కరోజు దీక్ష చేశాడు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేలెంత? అవసరమైతే బాహాబాహీకి తాను సిద్ధమని హెచ్చరించారు. కనీసం ఒక్కచోట కూడా గెలవలేని పవన్‌కల్యాణ్ 151 మంది ఎమ్మెల్యేలెంత అని లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు.
కనీసం తన మాటలు విని నవ్వుకుంటారనే స్పృహ కూడా లేదా అనే అనుమానం కలుగుతోంది. అంతేకాదు బాహాబాహీకి సిద్ధమని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి. రాజకీయమంటే కుస్తీ పోటీలు కాదు కదా? జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు యాత్ర చేస్తానని పవన్ ప్రకటించాడు.
లాంగ్‌మార్చ్, రైతు సౌభాగ్యదీక్ష, రైతుయాత్రల కంటే పవన్ అత్యవసరంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే యోగా. ఇప్పుడు పవన్‌కు తక్షణావసరం యోగానే. శరీరాన్ని, మనసును సమన్వయం చేసే విద్యే యోగా. శరీరం, మనసు, ఆత్మను పరమాత్మలో బంధింపజేసే గొప్ప శక్తి యోగాకు ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్‌ను దారికి తెచ్చేది ఒక్క యోగానే.
పవన్‌కు ఎక్కడో శరీరం, మనసు, ఆత్మకు బంధం తెగిపోయినట్టుంది. ఆ బ్యాలెన్స్ తప్పడం వల్లే బాహాబాహీకి సిద్ధం, మట్టికొట్టుకుపోతారు, తాట, తోలు తీస్తా లాంటి మాటలు ఆయన నోటి నుంచి వస్తున్నాయని అనిపిస్తోంది. జగన్ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలే అవుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది. జగన్‌పై యుద్ధం ప్రకటించడానికి చాలా సమయం ఉంది. ఈ లోపు పవన్ తనను తాను నియంత్రించుకుంటే మంచిది.