ప్రధానమైన విషయం.. కాశ్మీర్, భారత్ లో అంతర్భాగం అవుతుంది. ‘ఇన్నాళ్లూ కాదా?’ అని ప్రశ్నించవచ్చు. చాలా మంది దృష్టిలో నిజంగానే కాదు. కొన్నేళ్ల కిందట కేరళలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో భారత దేశ చిత్రపటాన్ని ముద్రిస్తూ జమ్మూకాశ్మీర్ లేకుండా ముద్రించారనే వివాదం రేగింది. నిజానికి అప్పట్లో నెహ్రూ చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. కాశ్మీర్, భారత్ లో అంతర్భాగం, ‘టెక్నికల్’గా కానేకాదని.. వాదించే మేధావులు మనకు చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు అలాంటి వాదనలకు ఆస్కారం లేదు. అయితే గియితే.. మోడీ వ్యతిరేకులు దుర్మార్గమైన పద్ధతిలో చట్టం తెచ్చారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆడిపోసుకోవాల్సిందే తప్ప… జమ్మూకాశ్మీర్ తో కూడిన భారత్ సమగ్ర చిత్రపటాన్ని కాదనలేరు. భారత్ లో ఇన్నాళ్లూ భాగమేనా కాదా అనే సందేహాల మధ్య దోబూచులాడుతుండిన కాశ్మీర్ సంపూర్ణంగా భాగమే అవుతోంది.
ఈ ఆర్టికల్ రద్దు ద్వారా ఇంకా చాలా చాలా జరగబోతున్నాయి…
-) జమ్ము-కాశ్మీర్ పౌరులకు ఇప్పటిదాకా ఉన్న ద్వంద్వ పౌరసత్వం రద్దవుతుంది. ఇక వారు కూడా ఆధార్ కార్డులు తీసుకోవాల్సిందే. ఇలాంటి పరిణామం వల్ల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఐడెంటిటీ నెంబర్) పద్ధతిని దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తింపజేయడానికి వీలవుతుంది.
-) జమ్ము-కాశ్మీర్ కు ఇక రెండు జాతీయ పతాకాలు ఉండవు. అశోకచక్రంతో కూడిన త్రివర్ణ పతాకమే.. ఆ ప్రాంతానికి కూడా పతాకం అవుతుంది. ఇన్నాళ్లూ వారు తమకు వేరుగా భావిస్తూ వచ్చిన జాతీయ పతాకం ఇక చెలామణీలో ఉండదు.
-) ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్ లో స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరిగిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్రానికి స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేరేరోజున సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటివన్నీ ఇక ఉండవు.
-) భారతీయ రాజ్యాంగ నిబంధనలతో నిమిత్తం లేకుండా… జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం ఇన్నాళ్లూ 6 సంవత్సరాలుగా ఉండేది. ఇకమీద భారత్ లోని తతిమ్మా అన్ని రాష్ట్రాల్లాగానే వారు కూడా అయిదేళ్లకోమారు ఎన్నికలకు వెళ్లాల్సిందే. లడాఖ్ లో అయితే ఆ ఎన్నికలు కూడా ఉండవు.
-) భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను ఇకమీదట జమ్మూ-కాశ్మీర్లో అవమానిస్తే నేరం కింద పరిగణించడం జరుగుతుంది. (రోజా చిత్రంలో ఒక ఉద్వేగభరితమైన సన్నివేశం మీకు గుర్తుకు రావొచ్చు. అలా జాతీయ పతాకాన్ని తగులబెట్టే దుర్ఘటనలు అక్కడ అనేకం. అలాంటివి ఇక కొనసాగవు.)
-) భారత సుప్రీంకోర్టు ఒక ఆదేశం చేసిందంటే.. దానిని జమ్మూ – కాశ్మీర్లో కూడా విధిగా అనుసరించాల్సి పాటించాల్సి ఉంటుంది.
-) భారతదేశంలోని ఏ ఇతర ప్రాంతానికి చెందిన వారైనా.. జమ్మూ కాశ్మీర్ లో పౌరుడిగా జీవించదలచుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అక్కడి వారిని పెళ్లి చేసుకోకపోయినా పౌరసత్వం పొందగలరు. ఎలాంటి నిబంధనలు లేకుండానే.. ఆ ప్రాంతంలో ఆస్తులను కూడా పెంపొందించుకోగలరు.
-) కాశ్మీర్లో ఇక మీదట సమాచార హక్కు పనిచేస్తుంది. కాగ్ నిబంధనలు వర్తిస్తాయి. భారత్ లోని అన్ని చట్టాలను కూడా వారు కూడా విధిగా అనుసరించాల్సిందే.
.. ఇంకా ఎన్నో కొత్త వెసులుబాటులు ఆర్టికల్ 370 రద్దు ద్వారా కొత్తగా చోటు చేసుకున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.