మోసం గురించి మాట్లాడుతున్నది ఎవరు?

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే ఇదే.  పారిపోతున్న దొంగ వాడే పోలీసులను చూసి దొంగా దొంగా అని అరవడం అంటే ఇదే.  తెలుగుదేశం పార్టీ నాయకులు గురువింద గింజ నీతిని అనుసరిస్తున్నారు.…

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే ఇదే.  పారిపోతున్న దొంగ వాడే పోలీసులను చూసి దొంగా దొంగా అని అరవడం అంటే ఇదే.  తెలుగుదేశం పార్టీ నాయకులు గురువింద గింజ నీతిని అనుసరిస్తున్నారు. తాము చేసిన మోసాలు కళ్ళముందు కనబడుతూ ఉన్నప్పటికీ…  జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడంటూ ప్రల్లదనాలు పలుకుతున్నారు. తమ వైఫల్యాల ఊసెత్తకుండా జగన్ మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అమరావతి,  దాని గురించి వివాదం నడుస్తున్న ఈ నేపథ్యంలో…  తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేశారని అంటున్నారు.  విశాఖపట్నంలో తమ పార్టీ నాయకులు ద్వారా ముందే భూములు కొనుక్కుని..  ఆ తర్వాత రాజధాని తరలింపు గురించి ప్రకటించారనేది ఆరోపణ. తద్వారా, అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వేల మంది రైతులు మోసం చేశారనేది మరో ఆరోపణ. ఇలాంటి  మోసాలను  జగన్ కు ఆపాదిస్తున్న వారే…  అసలు సిసలు మోసానికి ప్రతిరూపాలు అని రైతులు భావిస్తుండడమే ఇక్కడ విశేషం!!

చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ముందు రైతులకు రుణ మాఫీ అనే ఎర వేశారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నిలబెట్టుకోకుండా…  నాలుగు విడతల్లో చేస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు.  తీరా ఎన్నికలు ముంచుకు వచ్చే సమయానికి,  మూడు నాలుగు విడుదల మొత్తం చెల్లించకుండా మోసం చేశారు. అడ్డదారిలో ఓట్లు దండుకునే కుట్రతో…  డ్వాక్రా మహిళలందరికీ పది వేల రూపాయల వంతున పందేరం చేశారు గాని…  ఏ హామీ అయితే తనకు అధికారం ప్రాప్తింప చేసిందో…  ఆ రుణమాఫీ హామీ నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు.

అధికారం మారిన తర్వాత..  పాత ప్రభుత్వం రాజకీయ హామీలను నెరవేర్చే బాధ్యత తనకు లేదంటూ జగన్ సర్కారు సులువుగానే తప్పించుకుంది. ఆ రకంగా తమను అత్యంత ఘోరంగా  మోసం చేసింది చంద్రబాబు నాయుడు అనే అభిప్రాయం 13 జిల్లాల్లోని రైతన్నలలో ఉంది.

 అలాంటిది…  తాము చేసిన మోసాలను దిద్దు కొనే ప్రయత్నం చేయకుండా,  ఆ మోసాల గురించి సిగ్గుపడకుండా…  అమరావతి ప్రాంతంలో 29 పల్లెల్లోని కొందరు రైతులను జగన్ మోసం చేశాడంటూ..  బురద చల్లడం దేవినేని ఉమాకు మాత్రమే చెల్లింది. ఇప్పటికైనా ఈ నేలబారు రాజకీయాలు మానుకోవాలని ప్రజలు హితవు చెబుతున్నారు.