తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవ రకు జనసేన పార్టీ దుకాన్ బంద్ అయినట్లే. అయితే ఆ విషయాన్ని తన నోటితో ప్రకటించడానికి పవన్ కల్యాణ్ మొగమాట పడుతున్నారు. ఆ విషయం చెప్పకుండా.. తనను నమ్ముకుని బతుకుతున్న నాయకులను ఎటూ తోచని అగమ్యగోచరమైన స్థితిలోకి నెట్టివేస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేయకూడదని ఆయన నిర్ణయించారు.
తెలంగాణ అంటే తనకు చాలా ఎక్కువ ప్రేమ అని పవన్ కల్యాణ్ గతంలోనూ చాలా సార్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన పవన్.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా.. ఏపీలో పర్యటిస్తున్న పలు సందర్భాల్లో తనకు తెలంగాణ అంటే చాలా ప్రేమ అని పొగిడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట పోరాటాల్ని ఆయన ఇప్పటికీ కీర్తిస్తూ ఉంటారు. ఇదంతా నిజమే కావొచ్చు.. కానీ తెలంగాణలో కూడా ఏదో ఒకనాటికి పార్టీగా కొంతమేరకైనా వేళ్లూనుకోవడానికి ఆయన ప్రదర్శించే గిమ్మిక్కులు కావొచ్చు. ఏది ఏమైనప్పటికీ.. తెలంగాణలో పార్టీని కొనసాగిస్తున్నట్లుగానే పవన్ సంకేతాలు ఇస్తుండేవారు.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ తెలంగాణలో కొన్నిచోట్ల ఆయన తమ పార్టీ వారిని ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దించారు. పోటీకి దించారే తప్ప.. వారి కోసం ఆయన ఒక్కరోజు కూడా వెచ్చించలేదు. వారి తరఫున ప్రచారం నిర్వహించలేదు. ఫోకస్ మొత్తం ఏపీలో జగన్ ను ఓడించడం మీదనే పెట్టారు. అక్కడ చతికిలపడడంతో పాటూ.. తెలంగాణలో పార్టీని గాలికి వదిలేశారనే అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు.
నిజానికి అక్కడితోనే.. తెలంగాణ జనసేన ఖేల్ ఖతమ్ అయిపోయింది. కానీ తన నోటితో దుకాన్ బంద్ అనే మాట వెల్లడించడానికి ఆయనకు మనసు రాలేదు. హైదరాబాదులో స్టోరీ సిటింగులకు మధ్య కాస్త ఖాళీ దొరికితే… తెలంగాణ పార్టీ నాయకులతో కలుస్తూ… విజయవాడ టూర్లు వెళ్లినప్పుడు అక్కడ ప్రజల్తో కలుస్తూ ఆయన పార్టీని నడిపిస్తూ ఉన్నారు.
తీరా ఇప్పుడు తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు వచ్చాయి. పార్టీ దుకాన్ బంద్ చెప్పలేరు గానీ.. ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి తమకు సత్తా లేదని పవన్ గుర్తించారు. అందుకే.. ప్రత్యేక కారణాలు ఉన్నాయంటూ.. ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. దీంతో పవన్ లోని పిరికితనం పూర్తిగా బయటపడిందని పలు విమర్శలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణలో పవన్ ను నమ్ముకున్న వాళ్లంతా తమ దారి తాము చూసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.