అమరావతి ప్రాంతంలో.. అంటే అచ్చంగా రైతులు ఇచ్చిన భూముల్లో రాష్ట్ర రాజధాని అనేది తరలిపోవచ్చు గాక.. కానీ.. అదే స్థలంలో.. ఒక నగరం మాత్రం నిర్మాణం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తాజాగా సీఆర్డీయే అధికార్లతో నిర్వహించిన సమీక్ష, రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేయడం గురించి, మౌలిక వసతులు కల్పించడం గురించి చర్చించిన విషయాలను గమనిస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది.
రాజధాని గురించి ఎంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ… ‘రాజధాని తరలిపోతుందని మీకు ఎవరు చెప్పారు?’ అనే ప్రశ్నలు కూడా వైకాపా నాయకులనుంచి వినవస్తూనే ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చినాకూడా.. శాసనస వ్యవస్థతో పాటు కొంత మేర రాజధాని వాతావరణం అమరావతిలో మిగిలే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన రెడ్డి సీఆర్డీయే అధికార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రైతులనుంచి తీసుకున్న భూములను వారికి హామీ ఇచ్చిన విధంగానే అభివృద్ధి చేసి తిరిగి అప్పగించడానికే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నదని తెలుస్తోంది. అంతా ఒప్పందం ప్రకారమే జరగాలని ఆయన ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని కొంత భాగం విశాఖకు తరలిపోవడం అనే మాట తప్ప.. రైతులు ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదనే సంకేతాలనే జగన్మోహన రెడ్డి యిస్తున్నారు. పైగా.. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఒప్పంద పత్రాలను పట్టుకుని.. ఏ ఒక్కరూ కూడా న్యాయస్థానం గడప తొక్కే అవకాశమూ లేకుండా.. ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. భూములను అభివృద్ధి చేసి వారికి తిరిగి అప్పగించడం వరకే ఒప్పందం అయితే గనుక.. ఆ విషయంలో.. జగన్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చేస్తుంది.
రాజధాని విషయంలో మాత్రమే తేడాలు వస్తాయి. ఆ రకంగా జరిగితే.. రాజధాని ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ.. అన్ని వసతులతో కూడిన ఒక కొత్త నగరం కార్యరూపంలోకి వస్తుందని భావించవచ్చు. అందుకే రాజధాని పోయినా.. అమరావతి ప్రాంతంలో మహానగరం వస్తుందని.. రైతులు దిగులుపడాల్సిన అవసరమేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.