పవన్‌ను ఫాలో అయిపోతున్న చంద్రబాబు

నడవడానికి ప్రయత్నించి, పోలీసులు అడ్డుకోగానే హఠాత్తుగా రోడ్డు మీద కూర్చుంటే చాలు.. బీభత్సంగా మైలేజీ వచ్చేస్తుంది. ఇది పవన్ కల్యాణ్ సాధించి చూపించిన పాఠం. చంద్రబాబునాయుడు కూడా మక్కీకి మక్కీగా దీనినే ఫాలో అయిపోతున్నట్లు…

నడవడానికి ప్రయత్నించి, పోలీసులు అడ్డుకోగానే హఠాత్తుగా రోడ్డు మీద కూర్చుంటే చాలు.. బీభత్సంగా మైలేజీ వచ్చేస్తుంది. ఇది పవన్ కల్యాణ్ సాధించి చూపించిన పాఠం. చంద్రబాబునాయుడు కూడా మక్కీకి మక్కీగా దీనినే ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తోంది. అమరావతి కోసం విపక్షాలు ప్లాన్ చేసిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనిని పెద్దది చేయదలచుకున్న చంద్రబాబు.. రోడ్డు మీద బైఠాయించడం ద్వారా హైడ్రామా నడిపించడానికి ప్రయత్నించారు.

కొన్ని రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహా డ్రామా నడిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమానికి రాకపోకల పరంగా శాంతి భద్రతల సమస్య వస్తుందని, కాసేపు వేచి ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ.. పవన్ కల్యాణ్ ఆరోజున పెడచెవిన పెట్టారు. ఆ సందర్భాన్ని  నాటకీయంగా తన మైలేజీకి వాడుకోవడానికి ప్రయత్నించారు. రోడ్డు మీద బైఠాయించి, పొలాల్లో దిగి నడుచుకుని వెళ్తూ హంగామా చేశారు.

ఆరోజున పవన్ కు లభించిన మైలేజీ చూసి చంద్రబాబుకు అసూయ పుట్టినట్టుంది. ఇప్పుడు ఆయన కూడా అదే ప్లాన్ ను కాపీ కొట్టేశారు. బస్సుయాత్ర ప్రారంభించడానికి వెళుతూ.. పోలీసులు అడ్డుకున్నందుకు రోడ్డు మీద బైఠాయించి.. హంగామా చేశారు. పోలీసులను జగన్ ప్రభుత్వాన్ని నానా రకాలుగా తూలనాడుతూ.. చంద్రబాబు చెలరేగిపోయారు.

అమరావతి – 3 రాజధానులు వ్యవహారాన్ని వీలైనంత రాద్ధాంతం చేసి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ తొలినుంచి ప్రయత్నిస్తూనే ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదన పట్ల.. వాళ్లు చేయగలిగిన రభస చేస్తూనే ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ అతిథిలాగా అమరావతికి వచ్చి రెండు మూడురోజుల కార్యక్రమాలతోనే మైలేజీ తెచ్చుకున్నారు. రోడ్డు మీద బైఠాయించడం, పొలాల్లో నడవడం ఆయనకు ఎడ్వాంటేజీ అయ్యాయి.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ బైఠాయింపులను సమర్థించారు కూడా. ఇప్పుడు అదే మార్గం ఫాలో అవుతున్నారు. రోడ్డు మీద కూర్చుంటే ప్రజలు తన మీద విపరీతంగా జాలిపడిపోయి.. జగన్ ను తప్పుపడతారని అనుకుంటే తెలుగుదేశం నేత తప్పు చేసినట్టే. ఏ ముసుగులో ఎవరు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు.