చంద్రబాబునాయుడుకు ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులుగానే కనిపిస్తున్నారు. ఆయన తరచూ అనే మాట కూడా అదే. ఈ ప్రాంత ప్రజలు శాంత స్వభావులు. తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉంటారు అని. అవును మరి డెబ్బై ఏళ్ళ పైబడి ఈ ప్రాంత వాసులు అలాగే ఉన్నారు.
తమ పనుల కోసం ఉన్న ఊరుని, కన్నవారినీ కూడా కాదనుకుని వలసల బాట పడుతున్నారు. దుబాయ్, ముంబైలలో తేలేది ఉత్తరాంధ్రావాసులే, కూటి కోసం కూలి కోసం బంధాలను తెంచేసుకున్న ఉత్తరాంధ్రా బడుగు జీవులది ఊరుమ్మడి బతుకుల కధ.
అందుకే ఓట్లు వేయించుకుని ఆనక ఎన్ని కబుర్లు చెప్పినా ఈ ప్రాంతం వారు వింటారని బాబు వంటి వారు అనుకుంటున్నారు. టీడీపీని కంచుకోటగా చేసింది ఇదే ఉత్తరాంధ్రావాసులు.
1989లో అన్న నందమూరిని ఉమ్మడి రాష్ట్రమంతా తిరస్కరిస్తే అక్కున చేర్చుకుని దాదాపుగా అధిక సీట్లలో గెలిపించడమేడమే కాదు. బొబ్బిలి ఎంపీ సీటుని కూడా ఇచ్చింది ఈ ప్రాంతం.
చంద్రబాబు 2004, 2009లలో ఓడిపోయినా ఇక్కడ మాత్రం పసుపు వన్నే వాడలేదు. 2014లో సైతం పాతిక అసెంబ్లీ సీట్లు, అయిదుకు అయిదూ ఎంపీ సీట్లను కట్టబెట్టిన నేల ఈ ఉత్తరాంధ్రా.
అలా అన్ని సార్లూ అందలం ఎక్కించినా విభజన ఏపీలో కూడా ఉత్తరాంధ్రా ఉసురు తీస్తున్నారని ఆగ్రహించే 2019 ఎన్నికల్లో మాత్రం సైకిల్ కి గట్టి పంక్చర్లు వేసింది. దాంతో ఆరంటే ఆరు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు మాత్రమే టీడీపీకి దక్కాయి.
ఎందుకిలా జరిగిందని కనీస ఆలోచన చేయకుండా చంద్రబాబు ఇప్పటికీ ఉత్తరాంధ్రా మీద విషం కక్కుతున్నారు. విశాఖను రాజధానిగా చేస్తామంటే వద్దు అంటూ అడ్డం తిరుగుతున్నారు.
ఉత్తరాంధ్ర అంటే అంత చులకనా బాబూ, అమాయకులనేనా ఇలా అడ్డుకుంటున్నావని స్పీకర్ తమ్మినేని సీతారామ్ గట్టిగానే గర్జిస్తున్నారు. విశాఖ రాజధాని కాదంటే బాబుని ఉత్తరాంధ్రాలో అడుగుపెట్టనీయమని తమ్మినేని సీరియస్ గానే ప్రకటించారు. ఇది తాను స్పీకర్ హోదాతో ఇలా అనడంలేదని, ఇక్కడ ఉన్న బడుగు జనం తరఫున ఉత్తరాంధ్రావాసిగా మాట్లాడుతున్నానని ఆయన అంటున్నారు.
విశాఖ అంటే అంత కోపమా బాబూ, విషం చిమ్ముతున్నావ్ అని నిలదీస్తున్నారు నిన్నటివరకూ ఆయనతో ఉన్న మాజీ టీడీపీ తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్. విశాఖ రాజధాని వద్దంటే ఈ ప్రాంతం వారికి మీరు కూడా వద్దు అంటున్నారు రహమాన్. ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధి చెందకూడదా, విశాఖ ఏ విధంగా రాజధానికి సరిపోదో చెప్పగలవా చంద్రబాబూ అని సూటిగానే రహమాన్ ప్రశ్నిస్తున్నారు.
మరి రద్దు చేసుకున్న విజయనగరం టూర్ ని బాబు కొనసాగించాలన్నా విశాఖపైన తన అభిప్రాయం మార్చుకోవాలేమో. లేకపోతే ఉత్తరాంధ్ర ఉరుముతుంది బాబూ అంటున్నారు వైసీపీ నేతలు.