బజ్ వీటికి..భయం వాటితో..

సంక్రాంతికి అరి వీర బజ్ తో వస్తున్నాయి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు. ఈ రెండు సినిమాలకు కాస్త అటు ఇటుగా వస్తున్నాయి రజనీకాంత్-మురగదాస్ కాంబినేషన్ లోని దర్బార్, కళ్యాణ్ రామ్-సతీష్ వేగ్నిశ…

సంక్రాంతికి అరి వీర బజ్ తో వస్తున్నాయి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు. ఈ రెండు సినిమాలకు కాస్త అటు ఇటుగా వస్తున్నాయి రజనీకాంత్-మురగదాస్ కాంబినేషన్ లోని దర్బార్, కళ్యాణ్ రామ్-సతీష్ వేగ్నిశ కాంబినేషన్ లోని ఎంత మంచివాడవురా సినిమాలు. మహేష్, బన్నీ సినిమాల హడావుడి మధ్య వీటి హడావుడి కనిపించడం లేదు. అలా అని వాటిని తీసిపారేయడానికి లేదు. 

తెలుగులో స్ట్రయిట్ గా తీసిన రెండు సినిమాలు తప్పిస్తే, దర్శకుడు మురుగదాస్ మరీ నాసిరకం సినిమాలు ఎప్పుడూ తీయలేదు. శ్రీనివాస కళ్యాణం సినిమాలో మరీ ఉపన్యాసాలు, ఉపదేశాలు ఎక్కువయ్యాయి కానీ, లేదూ అంటే దర్శకుడు సతీష్ వేగ్నిశ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.

మురగదాస్ కు ఈసారి రజనీ కాంత్ తోడయ్యారు. సతీష్ వేగ్నిశ కు ఇప్పుడు ఓ మాంచి గుజరాతీ సినిమా కథ దొరికింది. రెండు సినిమాల ట్రయిలర్లు బయటకు వచ్చాయి. బాగానే వున్నాయి అన్న టాక్ వచ్చింది.

సంక్రాంతికి ఎంత పెద్ద సినిమాలు వచ్చినా, సరైన చిన్న సినిమా పడితే జనం ఇట్టే హిట్ చేస్తారని గతంలో ఒకటి రెండు సినిమాలు నిరూపించాయి. ఆ ఆశలు ఎంత మంచి వాడవురా సినిమాకు వున్నాయి. అలాగే పండగకు మాస్ సినిమాలకు చాన్స్ వుంటుంది. దర్బార్ కు ఆ లక్షణాలు వున్నాయి. అవి కనుక నచ్చితే దాని వెనుక వచ్చే సరిలేరు, అల సినిమాలకు ఆ ఎఫెక్ట్ వుంటుంది. 

ఎంత సంక్రాంతి అయినా, అన్ని సినిమాలు చూస్తారు అనుకున్నా, షేర్ ను కాస్తయినా చీల్చే ప్రమాదం వుంది. బాగా లేకపోతే, జనం ఇట్టే పక్కన పెట్టి, ఏ సినిమా బాగుంటే దాన్నే పట్టేసుకుంటారు. అయితే చిరకాలంగా రజనీ సినిమాలు తెలుగులో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. అది ఒక్కటే ధీమా. 

9, 11, 12 తరువాత రెండురోజులు గ్యాప్ ఇచ్చి ఎంత మంచి వాడవురా సినిమా వస్తోంది. భీకరంగా థియేటర్లు వేస్తున్నారు సరిలేరు, అల సినిమాలకు. అందువల్ల మాగ్జిమమ్ సినిమా ప్రియలు ఆరంభంలోనే వాటిని చూసేస్తే, ఈ సినిమా మీదకు వస్తారు. అందువల్ల పండగలో ఆ పెద్ద సినిమాలకు రిపీట్ ఆడియన్స్ తగ్గే ప్రమాదం కూడా వుంది.

మొత్తం మీద రెండు భారీ సినిమాలకు కుడి ఎడమల కనిపించని ప్రమాదం పొంచి వుంది. ఎటొచ్చీ అవి బాగా లేకపోతే ప్రమోదం అవుతుంది. బాగుంటే ప్రమాదం అవుతుంది. ఒక సినిమా సంగతి గురువారమే తేలిపోతుంది.