ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

ముఖ్యమంత్రి పదవి తర్వాత అత్యంత కీలకమైన పదవి ఉప-ముఖ్యమంత్రి మాత్రమే. పరిపాలన పరంగా ఈ పదవికి అంత ప్రాముఖ్యత లేకపోయినా, రాజ్యాంగపరంగా ఇది అత్యంత కీలకమైన పోస్టు. అందుకే ఈ పదవిని తమకు అత్యంత…

ముఖ్యమంత్రి పదవి తర్వాత అత్యంత కీలకమైన పదవి ఉప-ముఖ్యమంత్రి మాత్రమే. పరిపాలన పరంగా ఈ పదవికి అంత ప్రాముఖ్యత లేకపోయినా, రాజ్యాంగపరంగా ఇది అత్యంత కీలకమైన పోస్టు. అందుకే ఈ పదవిని తమకు అత్యంత ఆప్తులైన వారికి మాత్రమే ఇస్తుంటారు ఏ ముఖ్యమంత్రి అయినా. మరి ఈసారి జగన్ హయాంలో డిప్యూటీ సీఎం పదవి ఎవర్ని వరించబోతోంది? డిప్యూటీ సీఎం రేసులో ఉన్న వాళ్లు పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది రాజ్యాంగపరంగా కీలకమైనదే తప్ప, పాలన పరంగా అంత చెప్పుకోదగ్గ పోస్ట్ కాదు. అందుకే డిప్యూటీ సీఎం పదవితో పాటు మరో కేబినెట్ బెర్త్ ను కూడా జోడించి శాఖలు కేటాయిస్తుంటారు.

ఎప్పట్లానే ఈసారి కూడా ఉప-ముఖ్యమంత్రి పదవి కాపు సామాజిక వర్గ నేతకే దక్కే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే అందరికంటే ముందున్న వ్యక్తి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉమ్మారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్ లీడర్ గా, పెద్దమనిషిగా ఉన్న ఉమ్మారెడ్డిని గౌరవించుకోవాలంటే ఇంతకుమించిన పదవి లేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు డిప్యూటీతో పాటు మరో శాఖను కూడా ఈయనకు కేటాయించే ఛాన్స్ ఉంది.

గత ప్రభుత్వంలో నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా చినరాజప్పకు డిప్యూటీ వరించింది. ఈసారి కూడా జగన్ అదే వ్యూహాన్ని అనుసరించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చాలా కీలకంగా మారింది. ఇదే వర్గంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కువగా దృష్టిపెట్టడంతో, జగన్ కూడా కాపులకు అత్యథిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

పైగా ఈ ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంక్ క్లియల్ గా వైసీపీ పక్షాన నిలిచింది. పవన్ కల్యాణ్ కులం కార్డు ఉపయోగించినప్పటికీ, మెజారిటీ కాపులు వైసీపీ వైపు వచ్చారు. కాబట్టి ఆ సామాజిక వర్గంపై జగన్ కు కచ్చితంగా ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఎవరైనా కాపు నేతకు ఉప-ముఖ్యమంత్రి పదవితో పాటు మరో కీలక పదవి అప్పగించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకోవాలని జగన్ అనుకుంటున్నారు.

ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం రేసులో ఉమ్మారెడ్డి మాత్రమే ఉన్నారు. ఆఖరి నిమిషంలో కీలక మార్పులు జరగకపోతే, ఆయనే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే జగన్ కేబినెట్ లో ఉప-ముఖ్యమంత్రి పదవి ఉండదనే కామెంట్స్ కూడా మరో వైపు నుంచి వినిపిస్తున్నాయి. దానికి బదులు, కాపు ఎమ్మెల్యేలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన శాఖలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. 7వ తేదీన జరగనున్న వైసీపీఎల్పీ సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వస్తుంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు