అమ్మకానికి 99!

సంకుచిత, వక్ర ప్రయోజనాలతో మొదలయ్యే ప్రస్థానాలు… సదరు ప్రయోజనాలు ఈడేరగానే లేదా విఫలం కాగానే అర్థంతరంగా అంతమైపోతాయి. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ99 పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన…

సంకుచిత, వక్ర ప్రయోజనాలతో మొదలయ్యే ప్రస్థానాలు… సదరు ప్రయోజనాలు ఈడేరగానే లేదా విఫలం కాగానే అర్థంతరంగా అంతమైపోతాయి. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ99 పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించి నాలుగేళ్ల తర్వాత.. దానిని క్రియాశీలంగా నడపదలచుకున్నప్పుడు… ఆయన వ్యవహారాలకు, వార్తలకు చిడతలుగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో టీవీ99ను దొరకబుచ్చుకున్న కొత్త యాజమాన్యం… జనసేన పరాభవపర్వం సంపూర్ణం అయిన తర్వాత ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత సీపీఐ పార్టీ అనుబంధ న్యూస్ ఛానెల్ గా ఆవిర్భవించి, తర్వాత జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ఆధీనంలోకి వెళ్లిన టీవీ99 ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది.

తోటచంద్రశేఖర్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అన్నీ ఎదురుదెబ్బలే తిన్నారు. ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరైన తర్వాత.. 2009లో చిరంజీవి ప్రాపకంతో గుంటూరు ఎంపీగా పోటీచేసిన తోట చంద్రశేఖర్, 2014 నాటికి వైకాపాలో చేరి తాడేపల్లి గూడెం నుంచి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తిరిగి ఆ వెంటనే జనసేనలోకి వచ్చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే జనసేనకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించారనే పేరుంది.

టీవీ ఛానెళ్లలో తనకు ప్రచారం తక్కువ అవుతున్నదని పవన్ కల్యాణ్ వాపోతున్నప్పుడు 99 న్యూస్ ఛానెల్ ను ఆయన కొనుగోలు చేసి… పవన్ ప్రచారాలకు అంకితం చేశారు. జనసేన అనుకూల సోషల్ మీడియా ప్రచారం నిర్వహించే బృందాలన్నిటినీ ఆయనే పోషించారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి… గతంలో రెండుసార్లు పోటీచేసిన ఎంపీ పదవికి కాకుండా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు.

జనసేన మద్దతుతో కూడిన ప్రభుత్వం మాత్రమే ఏపీలో అధికారంలోకి వస్తుందని, అప్పుడిక తాము మంత్రి పదవులను పొందవచ్చునని జనసేన ఆశావహులు ఊహించుకుని ఉంటే తప్పేం లేదు. కానీ.. ఆయన ఎమ్మెల్యేగా కూడా దారుణంగా ఓడిపోయారు. ఓటమి గురించి ముందుగానే పసిగట్టి ఖర్చు దగ్గర జాగ్రత్తపడ్డారనే పుకారు కూడా ఉంది. ఏతావతా ఇప్పుడు 99 ఛానెల్ ఆయనకు గుదిబండగా మారింది. ఆయన దానిని వదిలించుకోవాలని చూస్తున్నారని సమాచారం.

నిర్వహణ తనవల్ల కావడం లేదని… పార్టీనే దానిని టేకోవర్ చేయాలని ఆయన పవన్ కల్యాణ్ వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. కాకపోతే.. పార్టీనే కుదేలైపోయి ఉండగా.. ఈ గుదిబండను మెడకు తగిలించుకోవడానికి పవన్ మాత్రం ఎందుకు ఆసక్తి చూపిస్తారనేది ఒక వాదన. మొత్తానికి టీవీ 99 అతిస్వల్ప వ్యవధిలోనే అమ్మకానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు