చంద్రబాబుకి విశాఖ ఎందుకు ‘వద్దు’.?

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకప్పుడు కంచుకోట. ఆ పార్టీకి మొత్తంగా ముగ్గురు లోక్‌సభ సభ్యులు గత ఎన్నికల్లో దక్కితే, అందులో ఇద్దరు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారు.. ఒకరేమో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి…

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకప్పుడు కంచుకోట. ఆ పార్టీకి మొత్తంగా ముగ్గురు లోక్‌సభ సభ్యులు గత ఎన్నికల్లో దక్కితే, అందులో ఇద్దరు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారు.. ఒకరేమో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి గెలిచిన వ్యక్తి. స్వర్గీయ నందమూరి తారకరామారావు మీద అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చెరిగిపోని అభిమానం ఉత్తరాంధ్ర ప్రజల్లో కన్పిస్తుంది. చంద్రబాబు కారణంగా క్రమక్రమంగా ఆ 'అభిమానం' తగ్గుతూ వచ్చింది టీడీపీ మీద.

ఇకపై సమీప భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉత్తరాంధ్రలో కన్పించకపోవచ్చు. ఎందుకంటే, ఉత్తరాంధ్రలో ప్రముఖమైన నగరం విశాఖపట్నంకు రాజధాని హోదా ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెబుతుండగా, దానికి తెలుగుదేశం పార్టీ అడ్డుతగులుతోంది. 'మూడు రాజధానులు వద్దు, ఒక్క అమరావతి ముద్దు' అంటూ చంద్రబాబు అండ్‌ టీమ్‌ నినదిస్తోన్న విషయం విదితమే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి రాజధానిగా కన్పించిన ఒకే ఒక్క నగరం నిస్సందేహంగా విశాఖపట్నం మాత్రమే. ఎందుకంటే, హైద్రాబాద్‌ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ విశాఖపట్నమే అతి పెద్ద నగరం. దురదృష్టవశాత్తూ అప్పట్లో విశాఖకు రాజధాని హోదా దక్కలేదు.. అదీ చంద్రబాబు పుణ్యమే. 'హుద్‌హుద్‌ తుపాను' తెచ్చిన నష్టం కంటే, ఆ తుపాను పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం విశాఖకు 'బ్రాండ్‌'కి కలిగించిన నష్టమే ఎక్కువ.

తెలంగాణ విషయంలో చంద్రబాబు ఏం చేశారో, ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయంలోనూ చంద్రబాబు అదే చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణ నేతలు ఎలాగైతే, తెలంగాణ రాష్ట్ర నినాదం విషయమై చంద్రబాబుతో విభేదించారో, ఇప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలూ చంద్రబాబుతో అలాగే విభేదిస్తున్నారు. మామూలుగా ఓ సారి తప్పిదం జరిగితే, దాన్ని నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవంతో సరిదిద్దుకోవాలి. కానీ, చంద్రబాబు పదే పదే తప్పు చేస్తున్నారు. దానర్థం ఆయనది అమాయకత్వం కాదు.. మూర్ఖత్వం అని.

విశాఖ రాజకీయాల్ని కలుషితం చేసే క్రమంలో సొంత పార్టీ ప్రయోజనాల్నీ చంద్రబాబు పణంగా పెట్టిన మాట వాస్తవం. ఆ కారణంగానే అవంతి శ్రీనివాస్‌, టీడీపీని వీడారు. గంటా శ్రీనివాసరావు ఎలాగోలా ఇప్పటిదాకా టీడీపీలో కొనసాగినా, ఇకపై టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదు. 'రాజధానిగా విశాఖ వద్దు' అని చెప్పడానికి చంద్రబాబు వద్ద సరైన కారణం లేదు. ఆ సంగతి ఆయనకీ తెలుసు. కానీ, విశాఖ వద్దంటే వద్దు.. చంద్రబాబుకి. ఇదేం రాజకీయం.?

తిడితే పడటానికి నేను పవన్ కళ్యాణ్ కాదు