ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రాజధాని కాదు, మూడు రాజధానుల ఏర్పాటు అవసరం ఉందని అసెంబ్లీ వేదికగా ఈ నెల 17న సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటన చేసినప్పటి నుంచి భూములిచ్చిన రాజధాని రైతుల కంటే ఎక్కువగా జగన్‌ను ఈనాడు అధినేత రామోజీ, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కే బెదిరిస్తున్నారు.
గోరింతలుంటే కొండంతలున్నట్టు చిత్రీకరిస్తూ రాజధాని రైతుల ఆందోళనలకు పేజీలకు పేజీలకు స్థలం కేటాయిస్తూ బెదిరింపులు, రెచ్చగొట్టే హెడ్డింగులు, కథనాలు రాస్తూ, వారిద్దరూ తమదైన మార్క్ జర్నలిజాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.
రాజధాని రైతుల ఆందోళన శుక్రవారానికి పదోరోజుకు చేరింది. జగన్ ప్రకటన తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించిన బ్లాక్‌మెయిల్, రెచ్చగొట్టే హెడ్డింగులేమిటో తెలుసుకుందాం.
ఈనాడులో…
‘జగన్ నోట 3 రాజధానుల మాట ’…అసెంబ్లీలో సీఎం ప్రకటనపై బ్యానర్ కథనం. ఆ కథనంతో పాటు ఇది తుగ్లక్ నిర్ణయంః చంద్రబాబు, ఒక రాజధానికే దిక్కులేదుః పవన్, ఆరు నెలలుగా మానసిక క్షోభః ఎంపీ జయదేవ్‌తో రాజధాని రైతులంటూ ప్రచురించారు. అలాగే ఆ మరుసటి రోజు నుంచి తాటికాయంత హెడ్డింగ్‌లుః ‘ఆత్మహత్యే శరణ్యం ’…అమరావతి రైతుల ఆవేదన, రగిలిన రాజధాని, భగ్గుమన్న రాజధాని రైతులు, రైతుల ఉసురుపోసుకోవద్దు, ‘ప్రతిధ్వనులు’ ..ఈటీవీ వార్తా బులెటిన్ కాదు సుమా… అమరావతిలో మిన్నంటిన ఆందోళనలపై రామోజీ రియాక్షనే ప్రతిధ్వనులై పలికింది.
మరికొన్ని నిప్పు కణికల్లాంటి హెడ్డింగులు చూడండి, చదవండి… కదం తొక్కిన జనం (సబ్ హెడ్డింగ్ః రాజధానిలో ఉధృతంగా నిరసనలు), ఊళ్ల ఉగ్రరూపం…ఇక జగన్ సర్కార్ ఎంతకూ దిగిరాకపోవడంతో రామోజీ ఏకంగా ఉగ్రరూపమెత్తాడు మరి. రాజధాని మారిస్తే అధోగతే, నిరసనల హోరు, మూడు రాజధానులు వద్దు, ఉద్యమం ఉధృతం, పోలీస్ రాజ్యం, ఆత్మహత్యలే శరణ్యమంటూ జగన్ సర్కార్‌పై బ్లాక్‌మెయిల్ శీర్షికలు. ఈ రోజు కేబినెట్ సమావేశమవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ అంటూ ఈనాడు బ్యానర్ హెడ్డింగ్‌తో కథనాన్ని ఇచ్చింది.
చంద్రబాబుకు రామోజీని రాజగురువుగా పిలుస్తారు. మరి వెంకయ్యనాయుడు ఏ గురువో తెలియదు కానీ, తన ‘కమ్మ’ని ప్రేమను ఎక్కడా దాచుకోలేదాయన. ‘ఎవరికి చెప్పాలో వారికి చెబుతా’ అని తనను కలిసిన రాజధాని రైతులతో వెంకయ్యనాయుడు అన్న మాటలకు రామోజీ ప్రాధాన్యం ఇచ్చారు. ఒకవైపు తాను రాజ్యాంగ పదవిలో ఉన్నానని, రాజకీయాల గురించి మాట్లాడొద్దంటూనే జగన్ సర్కార్‌ను ఎంతగా బెదిరించారో చూడండి. అంతేనా ఆ మరుసటి రోజు పాలనంతా ఒకే చోట ఉండాలని శ్రీమాన్ ఉపరాష్ట్రపతి గారు సెలవిచ్చారు. మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూనే, మరోవైపు పాలనంతా ఒకేచోట ఉండాలని సెలవివ్వడం ఒక్క ‘నాయుడు’ గారికే చెల్లు.
ఇక మన రాధాకృష్ణ… అబ్బో ఈయన గురించి చెప్పాల్సిందే చాలానే ఉంది. తింటే గారెలు , వింటే మహాభారతం వినాలని పెద్దలు చెప్పారు. అప్పటికి రాధాకృష్ణ పుట్టలేదు కాబట్టి అలా చెప్పారేగానీ, వింటే రాధాకృష్ణ చరిత్ర, చదివితే ఆంధ్రజ్యోతి ‘వ్యూస్’ మాత్రమే చదవాలని చెప్పేవారేమో.
ఈ తొమ్మది రోజులు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్‌కు పండగే పండగ. ఎందుకంటే జగన్‌పై విషం కక్కడానికే ఇంతకు మించిన మంచి సమయం మరెప్పుడు దొరుకుతుంది. చదవండి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్‌లు…
‘మూడు’పై మంటలు, తాడోపేడో, నివేదికపై నిప్పులు, రగులుతున్న రాజధాని, రాజధాని రగడ అమిత్షా దృష్టికి, రాజధాని ‘రణం’, ఏం జరుగుతోంది?-రాజధానిపై పీఎంవో ఆరా (బెదిరింపు కథనం), న్యాయం కావాలి!- ఒకే స్వరంతో నినదిస్తున్న రాజధాని రైతు, రాజకీయ రాక్షస క్రీడ (రాజకీయ సన్నాసి సబ్బం హరి చెప్పిందానికి ప్రాధాన్యం), మీకు నచ్చలేదని మార్చేస్తారా? (చంద్రబాబు) , రాజీలేదు…అమరావతే…ఇవి నిన్నటి వరకు ఆంధ్రజ్యోతి హెచ్చరికలు. శుక్రవారం పత్రిక బ్యానర్… కాదంటే కదనమే (సబ్ హెడ్డింగ్ః మార్పే తీర్పయితే మంటలే) అని ఇచ్చారు. అలాగే మొదటి పేజీలో… నియోజకవర్గాల్లో తిరగలేక పోతున్నాం, కేబినెట్‌లో తప్పుడు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే అంటూ ఇండికేషన్స్ ఇచ్చి లోపలి పేజీల్లో వార్తలను ఇచ్చారు.
ఒక్కసారి వైఎస్సార్ పాలన రోజుల్లోకి వెళుదాం. కడప జిల్లా జమ్మలమడుగులో బ్రాహ్మణి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని దివంగత వైఎస్సార్ నిర్ణయిస్తే…ఇదే ఆంధ్రజ్యోతిలో వన్యప్రాణులు తిరగాడే చోట, సెలయేర్లు పారేచోట ఉక్కు ఫ్యాక్టరీ ఏంటని ప్రశ్నిస్తూ పతాక వార్తగా రాసింది. అంటే పాలకులను బట్టి పాలసీలను పెట్టుకుని, నిజాలను పాతరేస్తున్న ఈ పత్రికల నైజాన్ని జనానికి తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం.
దొంగ వేషాలు వేస్తూ ప్రతినిత్యం నిజాల్ని, సత్యాన్ని హత్యచేస్తూ ప్రజల పక్షాన ఉన్నట్టు నటిస్తున్నారు. ఇప్పుడు రాజధాని రైతులపై ప్రేమతో కాదు…జగన్‌తో పాటు అమరావతి మినహా మిగిలిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలపై కక్షతోనే వార్తా కథనాలను వండివారుస్తున్నారు.
రామోజీ, రాధాకృష్ణల వ్యాపార స్వేచ్ఛకు భంగం కలగడంతో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లిందని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం యాడ్స్ రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి గగ్గోలు పెడుతున్నాయి. దాన్ని రాజధాని రైతుల ఆందోళన రూపంలో పగ తీర్చుకుంటున్నాయనేందుకు పైన ఉదహరించిన హెడ్డింగ్‌లే నిదర్శనం.