ఆర్‌కే..ఇదేనా జ‌ర్న‌లిజం అంటే

‘సిగ్గూఎగ్గూ ఎందుకు చెప్పు ఆత్మ‌గౌరవం అస‌లుకే ముప్పు’ అని ప్ర‌సిద్ధ క‌వి గ‌జ్జ‌ల మ‌ల్లారెడ్డి ఏనాడో చెప్పారు. Advertisement ఆయ‌న మాట‌లు ‘ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ‌’కు అతికిన‌ట్టు స‌రిపోతాయి. అక్ష‌రం మా ఆయుధం అని…

‘సిగ్గూఎగ్గూ ఎందుకు చెప్పు ఆత్మ‌గౌరవం అస‌లుకే ముప్పు’ అని ప్ర‌సిద్ధ క‌వి గ‌జ్జ‌ల మ‌ల్లారెడ్డి ఏనాడో చెప్పారు.

ఆయ‌న మాట‌లు ‘ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ‌’కు అతికిన‌ట్టు స‌రిపోతాయి. అక్ష‌రం మా ఆయుధం అని చెప్పుకునే ఆర్‌కే…ఆ ఆయుదాన్ని స‌త్యాన్ని, నిజాన్ని నిర్భ‌యంగా న‌రికేందుకు వాడుతున్నాడు.

పాఠ‌కులు, ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారోన‌నే క‌నీస స్పృహ కూడా లేకుండా, త‌న‌కు, త‌న ఆరాధ్య దైవం చంద్ర‌బాబుకు లాభం  క‌లిగించే వార్త‌ల‌ని మాత్ర‌మే ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌చురిస్తున్నారు. నిజానికి నిలువెత్తు పాత‌రేయ‌డంలో ఆంధ్ర‌జ్యోతికి సాటివ‌చ్చే ప‌త్రిక మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు.  రాష్ట్ర ప్ర‌జానీకానికి విశాఖ టీడీపీ మ‌నోగ‌తం తెలియ‌కుండా, నిజానికి పాత‌రేయాల‌నే ఆంధ్ర‌జ్యోతి దుర్బుద్ధిని ఎత్తి చూప‌డ‌మే ఈ క‌థ‌నం ప్ర‌ధాన ఉద్దేశం.

నిజం నిప్పులాంటిదంటారు. దాన్ని ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు. విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధాని చేయాల‌నే జ‌గ‌న్ స‌ర్కార్ ఆలోచ‌న నేప‌థ్యంలో రాజ‌ధానికి భూములిచ్చిన రైతులు ఏడురోజులుగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. వారి నిర‌స‌న‌కు సంబంధించి ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కానీ రాష్ట్ర‌మంటే అమ‌రావ‌తి మాత్ర‌మే కాదు క‌దా. మిగిలిన ప్రాంతాల అభిప్రాయాలు, ఆకాంక్ష‌లు కూడా ఉంటాయి. వాటిని కూడా రాష్ట్ర ప్ర‌జానీకానికి తెలియ‌జేయాల్సిన బాధ్య‌త మీడియా సంస్థ‌ల‌పై ఉంటుంది. కానీ ఆంధ్ర‌జ్యోతి ఆ ప‌ని ఏ మాత్రం చేయ‌డం లేదు.

‘విశాఖ ఏమంటోంది?’ శీర్షిక‌తో ‘ఆంధ్ర‌జ్యోతి’లో క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. ఈ క‌థ‌నంలో ‘విశాఖ పరిపాలనా రాజధాని కావొచ్చు’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినప్పుడు కానీ… విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్‌ కార్యాలయం ఉండాలని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని జీఎన్‌ రావు కమిటీ సిఫారసు చేసినప్పుడు కానీ… విశాఖపట్నంలో బహిరంగంగా ఎలాంటి ఆనందం కనిపించలేదు. ఏ సంఘాల వారూ సంబరాలు చేసుకోలేదు. చివరికి… అధికార పార్టీ కార్యకర్తలు కూడా బాణసంచా పేల్చలేదని రాశారు.

‘రాజధాని’ ప్రకటనపై పేదలు, సాధారణ ప్రజలు, సగటు ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు కనిపించడంలేదు. అలాగని… బహిరంగంగా వ్యతిరేకించడమూ లేదు. అయితే… ఇప్పటికే తాము ఉన్న ఇళ్ల అద్దెలు పెరుగుతాయని కొందరు, సొంత ఇంటి కల మరింత వెనక్కి పోతుందని ఇంకొందరు ఆందోళన చెందుతున్నారు’ అని విశాఖ వాసుల అభిప్రాయాలుగా ఆంధ్ర‌జ్యోతి రాసుకొచ్చింది.

ఇదే విశాఖ‌ప‌ట్నంలో మంగ‌ళ‌వారం విశాఖ అర్బ‌న్‌, రూర‌ల్ టీడీపీ అధ్య‌క్షులు, న‌లుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, న‌లుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు స‌మావేశ‌మై జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు తీర్మానం కూడా చేశారు. ఈ స‌మావేశానికి సంబంధించి సాక్షి, ఈనాడు ప‌త్రిక‌ల్లో స్టేట్ పేజీలో వార్త‌ను క‌వ‌ర్ చేశారు. ఆంధ్ర‌జ్యోతి మాత్రం  జిల్లా సంచిక మొద‌టి పేజీలో ‘స్వాగ‌తిస్తున్నాం’ శీర్షిక‌తో వార్త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ‘విశాఖ ఏమంటోంది?’ అంటూ రాసిన క‌థ‌నంలో టీడీపీ అర్బ‌న్‌, రూర‌ల్ ప్ర‌జాప్ర‌తినిధులు, సీనియ‌న్ నేత‌ల అభిప్రాయాలు ఎందుకు చోటు చేసుకోలేదు.

29 గ్రామాల రాజ‌ధాని రైతుల నిర‌స‌న‌కు మొత్తం పేప‌ర్ అంతా స‌మ‌ర్పించిన ఆర్‌కేకు, బాబు పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల అభిప్రాయాల‌ను రాష్ట్ర ప్ర‌జానీకానికి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నిపించ‌లేదా? ఆంధ్ర‌జ్యోతి ఆర్‌కే దృష్టిలో మ‌నుషులంటే కేవ‌లం రాజ‌ధాని ప్రాంతం వారేనా? మిగిలిన వారు కాదా? ఇదేనా జ‌ర్న‌లిజం?  నిజాలు దాచ‌డానికి, అబ‌ద్ధాలను విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డానికేనా  స్వేచ్ఛ కావాల‌ని నిన‌దించేది?  నిజాల‌ను నిర్భ‌యంగా పాత‌రేస్తున్న‌మీ పాత్రికేయానికి హ్యాట్సాఫ్ ఆర్‌కే.