న్యూ ఇయర్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్

నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయంటే చాలు హైదరాబాద్ భ్రష్టుపట్టిపోతోంది. రేవ్ పార్టీలు, నగ్న నృత్యాలకు తోడు డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. దాదాపు మూడేళ్లుగా నగరంలో ఈ సంస్కృతి పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ…

నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయంటే చాలు హైదరాబాద్ భ్రష్టుపట్టిపోతోంది. రేవ్ పార్టీలు, నగ్న నృత్యాలకు తోడు డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. దాదాపు మూడేళ్లుగా నగరంలో ఈ సంస్కృతి పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వేడుకలకు సరిగ్గా 4 రోజుల ముందు భారీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు పోలీసులు.

హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఓ డ్రగ్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి భారీ ఎత్తున హెరాయిన్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీల కోసం వీటిని రేవ్ పార్టీలు, పబ్బులకు సప్లయ్ చేసేందుకు తీసుకొచ్చామని నిందితులు ఒప్పుకున్నారు.

ప్రస్తుతం వీళ్ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. వీళ్లతో సిటీలో ఏఏ పబ్బులు సంబంధం పెట్టుకున్నాయి.. వెనక ఎవరున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. వీళ్ల సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు.

గతంలో హైదరాబాద్ పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ ను విచ్ఛిన్న చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పలువురు సినీప్రముఖులకు నోటీసులు కూడా జారీచేశారు. అప్పట్నుంచి డ్రగ్ కల్చర్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు పోలీసులు.