మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద గతంలో పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనతో పాటు ఇంకా పలువురు ప్రముఖుల ఇళ్లు, వ్యక్తులపై కూడా ఐటీ దాడులు జరిగాయి. చంద్రబాబు పీఎస్ ఇంట్లోనే నాలుగురోజులకు పైగా ఐటీదాడులు జరగడం చూసి చాలా మంది నివ్వెర పోయారు. మరీ ఇన్నిరోజులా? అనుకున్నారు. మరోవైపు.. ఐటీ దాడులతో బెదిరించాలని చూస్తున్నారు.. వేధిస్తున్నారు.. అంటూ చంద్రబాబునాయుడు పాచిపోయిన పాత పాటనే మళ్లీ వినిపించారు. తన మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో ఆయన తన వణుకును, ఉలికిపాటును ఏమాత్రం దాచుకోలేకపోయారు. కంగారును అణిచిపెట్టుకోలేకపోయారు.
గతంలో సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి వ్యక్తుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగినప్పుడు కూడా.. చంద్రబాబు ఇదే తరహా మాటలు వల్లించారు. అది ఓకే… కానీ, ఒక సాధారణ పీఎస్ స్థాయి వ్యక్తిపై ఐటీ దాడులు జరిగితే.. ఆ విషయంలో కూడా చంద్రబాబు ఎందుకు జోక్యం చేసుకుని.. తన ఆక్రోశం వెళ్లగక్కాలి. అనే సందేహం చాలా మంది ప్రజలకు కలిగింది. కానీ.. అందులోని మర్మం ఇప్పుడు బయటకు వస్తోంది. ఐటీ దాడుల వివరాలను ఐటీ శాఖ కమిషనర్ సురభి ఆహ్లువాలియా పేరిట పత్రికలకు విడుదల చేశారు. అందులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలున్నాయి.
బోగస్ సబ్ కాంట్రాక్టర్లు, బోగస్ బిల్లులు, బోగస్ ఇన్వాయిస్ ల ద్వారా వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా ఈ ఐటీ దాడులలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని వందల అనుమానాస్పద డాక్యుమెంట్లు, ఖాళీ కాగితాలు సీజ్ చేశారు. ఈమెయిళ్లు, వాట్సప్ మెసేజీలు, విదేశీ లావాదేవీలన్నింటినీ కూడా సీజ్ చేశారు.
బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో నిధుల స్వాహా అనేది ఈ వివరాల్లో అత్యంత కీలకమైనది. కాంట్రాక్టుల్లో నాయకులు దోచుకోవడానికి ఇది ఒక డొంకతిరుగుడు మార్గం. ఒక వ్యక్తికి కాంట్రాక్టు కేటాయిస్తారు. మొత్తం పనిని అతనే చేస్తాడు.. కానీ.. ఒక సబ్ కాంట్రాక్టరుకు కొంత పేమెంట్ చేసినట్లుగా.. రికార్డుల్లో మాత్రం ఉంటుంది. సదరు సబ్ కాంట్రాక్టరు.. పని కేటాయించిన నాయకుడి తాలూకు బినామీ అయి ఉంటాడు. ఇదీ దోపిడీ పద్ధతి.
తన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ పై ఐటీదాడులు జరగ్గానే చంద్రబాబునాయుడు ఈ కారణంగానే జడుసుకున్నారని అనిపిస్తోంది. ఈ సబ్ కాంట్రాక్టర్ల బాగోతాలు మొత్తం బయటకు వస్తే గనుక.. ఏయే నాయకులకు ఏ ముసుగులో ఎంతెంత ముట్టిందో అంతా లెక్కతేలుతుంది. బాబు బండారం బట్టబయలవుతుంది.