ఈ కష్టం నీకు కనిపించలేదా కేటీఆర్..!

సమ్మె ప్రారంభంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య.. తర్వాత మహిళా కండక్టర్ ఉరేసుకొని ఆత్మహత్య.. తాజాగా గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్.. ఇలా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అర్థం…

సమ్మె ప్రారంభంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య.. తర్వాత మహిళా కండక్టర్ ఉరేసుకొని ఆత్మహత్య.. తాజాగా గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్.. ఇలా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం తమ మొండి పట్టుదల వీడడం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీఆర్ఎస్ నంబర్-2గా వ్యవహరిస్తున్న కేటీఆర్ కూడా మౌనం వహించడం బాధాకరం.

పార్టీలో కేసీఆర్ తర్వాత అన్నీ తానై చూసుకునే వ్యక్తి కేటీఆర్. పార్టీకి రెండో పెద్ద దిక్కు ఆయనే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. రాజకీయంగా ఇవన్నీ పక్కనపెడితే.. సమస్యలపై అప్పటికప్పుడు స్పందించి పరిష్కారాలు చూపించే వ్యక్తిగా కేటీఆర్ కు మంచి పేరుంది. ట్విట్టర్ లో ఏదైనా సమస్య కనిపిస్తే చాలు వెంటనే తన కార్యాలయానికి దాన్ని ట్యాగ్ చేస్తుంటారు కేటీఆర్. రోడ్డుపై చెత్త పడేసినా, అడ్డంగా చెట్టు కూలినా, డబ్బులేక ఎవరైనా హాస్పిటల్ చేరినా, సకాలంలో అంబులెన్స్ అందకపోయినా, చదువుకు ఇబ్బందిగా ఉన్నా.. ఇలా ఏ రకమైనా ఇబ్బంది ఉన్నా నేనున్నానంటూ ముందుకొస్తారు.

చివరికి సినిమా వాళ్ల సమస్యల్ని కూడా చిటికెలో పరిష్కరిస్తుంటారు. అలాంటి కేటీఆర్, ఆర్టీసీ సమ్మె విషయంలో పూర్తిగా మౌనం వహించడం బాధాకరం. ఓవైపు నిండు ప్రాణాలు బలైపోతుంటే.. నంబర్-2గా వ్యవహరిస్తున్న కేటీఆర్ అసలేమాత్రం స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయన పూర్తిగా తనశాఖకు మాత్రమే పరిమితమైపోయారు. అడపాదడపా కొన్ని సమస్యలపై స్పందిస్తున్నప్పటికీ ఎందుకో కేటీఆర్ కు మాత్రం ఆర్టీసీ కష్టం కనిపించడం లేదు.

ఆర్టీసీ కార్మికుల విషయంలో మంకుపట్టుతో ఉన్న కేసీఆర్ ను కాస్త మెత్తబడేలా చేయాలన్నా, సానుకూలంగా మార్చాలన్నా అది కేవలం కేటీఆర్ తోనే సాధ్యం. ఇది బహిరంగ రహస్యం. ఈ విషయంలో కేటీఆర్ ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. లేదంటే మరిన్ని దుర్వార్తలు వినాల్సి వస్తుంది. మరోవైపు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత కష్టమొచ్చినా ఆర్టీసీ కార్మికులు మాత్రం తమ ఉక్కు సంకల్పాన్ని వీడలేదు. 27వ రోజైన ఈరోజు కూడా పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. అటు దీనికి సంబంధించిన హైకోర్టు వాదనలు రేపటికి వాయిదాపడిన సంగతి తెలిసిందే. 

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే