నా 70 శాతం సంపాదన పెట్టేశా.. ఇదీ నా ధైర్యం

మీకు మాత్రమే చెప్తా సినిమాతో నిర్మాతగా మారాడు హీరో విజయ్ దేవరకొండ. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం తన 70శాతం సంపాదన ఖర్చుపెట్టానంటున్నాడు దేవరకొండ. Advertisement మొదటి సినిమాకే కాంప్రమైజ్ అయితే…

మీకు మాత్రమే చెప్తా సినిమాతో నిర్మాతగా మారాడు హీరో విజయ్ దేవరకొండ. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం తన 70శాతం సంపాదన ఖర్చుపెట్టానంటున్నాడు దేవరకొండ.

మొదటి సినిమాకే కాంప్రమైజ్ అయితే రిజల్ట్ తేడా కొడుతుందేమో అనే భయంతో, ధైర్యం చేసి మొత్తం డబ్బంతా పెట్టేశానంటున్నాడు.

“ఎవడే సుబ్రమణ్యం, పెళ్లిచూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి, నోటా, గీతగోవిందంతో పాటు మరో 2 యాడ్స్ తో సంపాదించిన డబ్బు మొత్తం మీకు మాత్రమే చెప్తా సినిమాకు పెట్టాను. ఇంకా చెప్పాలంటే నా 70శాతం కెరీర్, 70శాతం సంపాదనను ఈ సినిమాపైన పెట్టాను. రిజల్ట్ ఏమౌతుందో నాకు తెలీదు. సినిమా కథ నచ్చింది. కాంప్రమైజ్ కాకుండా చేయాలనిపించింది. అందుకే మొత్తం పెట్టేశా.”

తిరిగి సంపాదించుకోగలననే ధైర్యం ఉండబట్టే అంత మొత్తం పెట్టేశానని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎంత రిస్క్ అయినా చేయొచ్చని, కాకపోతే బ్యాకప్ కూడా చూసుకొని రంగంలోకి దిగాలని సూచిస్తున్నాడు.

ప్రస్తుతం తను ఉన్న పరిస్థితిలో డబ్బు సంపాదించుకోగనని, అందుకే రాజీ పడకుండా ఖర్చుపెట్టానని అంటున్నాడు.

“నా కెరీర్ లో కొద్దోగొప్పో పరిచయాలు పెంచుకున్నాను. వాళ్లకు సినిమా చూపిస్తే ఎంతో కొంత ఇస్తారని నమ్మకం. పైగా నాకు అతిపెద్ద నమ్మకం ఏంటంటే.. డబ్బులు పోయినా తిరిగి సంపాదించుకోగలననే ధైర్యం. కొన్ని రోజులు ఫీల్ అయినా, పోగొట్టుకున్నంత సంపాదించగలను. ఆ ధైర్యంతోనే నిర్మాతగా దిగాను. నా నమ్మకం నిజమైంది. సినిమా బిజినెస్ బాగా జరిగింది. పెట్టిన బడ్జెట్ లో 70శాతం వచ్చేసింది.”

అర్జున్ రెడ్డి టైమ్ లో అనసూయ-విజయ్ దేవరకొండ మధ్య బాగా వాగ్వాదం నడిచిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాను బాహాటంగానే విమర్శించింది అనసూయ. అలాంటి నటిని తను నిర్మాతగా తీస్తున్న మొదటి సినిమాలోకి తీసుకున్నాడు విజయ్ దేవరకొండ.

అనసూయను రిజెక్ట్ చేయాలనే ఫీలింగ్స్ తనకు లేవని, పైగా నటీనటుల ఎంపిక మొత్తం దర్శకుడే చూసుకున్నాడని తెలిపాడు. అనసూయకు తన చేతుల మీదుగానే రెమ్యూనరేషన్ ఇచ్చానని, తమ మధ్య ఉన్న బేధాభిప్రాయాల కంటే సినిమా చాలా పెద్దదంటున్నాడు దేవరకొండ.