తిరుమల కొండపై మార్పు మొదలైంది. సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టిన కొత్త పాలకమండలి, ఇప్పుడు మీడియా ఆగడాలపై కూడా దృష్టిపెట్టింది. లాబీయింగ్ లు, మధ్యవర్తిత్వాలు, దళారీ పనులు, కమీషన్లతో పాతుకుపోయిన మీడియా ప్రతినిధులపై గట్టిగా గురిపెట్టింది. కల్యాణం టిక్కెట్లు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ పాసుల మంజూరులో మీడియా ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
కొండపై మీడియా ఉద్యోగం అంటే కలెక్టర్ జాబ్ తో సమానం. మీడియాకు నడిచినట్టుగా టీడీపీ ఉద్యోగులకు కూడా నడవదనేది బహిరంగ రహస్యం. ప్రతి మీడియా రిపోర్టర్ కు కొండపై షాపులు ఉన్నాయంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. పోటు నుంచి లడ్డూల్ని బయటకు తీసుకొచ్చి బ్లాక్ లో అమ్మడం, రూములు ఇప్పించడం అనేది వీళ్లకు చాలా చిన్న పని. తమ దగ్గరే చిరుద్యోగుల్ని మెయింటైన్ చేస్తూ, వాళ్లతో ఇలాంటి పనుల్ని మీడియా ప్రతినిధులు చేయిస్తుంటారు.
కల్యాణం టిక్కెట్లు, ప్రత్యేక వీఐపీ దర్శనాలతో పాటు తిరుమల కొండపై షాపుల నుంచి వసూళ్లు, కొన్ని అతి ప్రత్యేకమైన స్వామివారి సేవా టిక్కెట్లు అందించడం లాంటి పనులు మాత్రమే మెయిన్ రిపోర్టర్లు రంగంలోకి దిగుతారు. ఇలాంటి పనులు చేస్తూ రోజుకు లక్ష రూపాయలు ఆర్జించే మీడియా ప్రతినిధి కూడా కొండపై ఉన్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎన్ని పాలక మండళ్లు మారినా, ఓ సెక్షన్ మీడియా ఏకంగా టీటీడీనే శాసించే స్థాయికి ఎదిగిందంటే వ్యవహారం ఎంతదూరం వెళ్లిందో అర్థంచేసుకోవచ్చు. చివరికి కొండపై రూముల్ని కూడా వీళ్లు ఆఫీస్ పనికోసం కాకుండా, తమ ప్రైవేటు కార్యకలాపాలకు వాడుకుంటున్నారు.
వీటన్నింటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది టీటీడీ. మీడియా సిఫార్సు లెటర్స్ ను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. అక్కడితో ఆగకుండా లెటర్ హెడ్ ఆధారంగా సదరు మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి నిర్థారించుకునే కార్యక్రమం ప్రారంభించారు. తాజాగా టీటీడీ విజిలెన్స్ చేపట్టిన తనిఖీల్లో బయటపడిన అక్రమాల్లో దాదాపు 90శాతం మీడియా ప్రతినిధులు చేసినవే. సదరు జర్నలిస్టుల పేర్లతో పాటు ఆగడాల చిట్టాను సంబంధిత పత్రికలు, ఛానెళ్లకు అందజేసింది విజిలెన్స్. దీంతో మీడియా సంస్థల్లో కూడా ఏరివేత మొదలైంది.
దశాబ్దానికి పైగా కొండపై తిష్టవేసిన ఓ పెద్దపత్రిక మీడియా ప్రతినిధిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ ఒక్క ఏడాదే అతడు 800కు పైగా వీఐపీ టిక్కెట్లు దక్కించుకున్నాడట. వాటిలో సదరు సంస్థ సిఫార్సు మేరకు ఇచ్చిన టిక్కెట్లు పట్టుమని 80 కూడా లేవట. అంతేకాదు, ఆ రిపోర్టరు తిరుపతిలో ఈమధ్య అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు. ఇక సమాజం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ వ్యవహారం కూడా బట్టబయలైంది. ఈ 10 నెలల్లో ఆ రిపోర్టర్ వివిధ సేవల పేరిట 700కు పైగా వీఐపీ టిక్కెట్లు దక్కించుకున్నాడు. అన్నీ బ్లాకులో అమ్ముడుపోయాయి. అతడ్ని కూడా సాగనంపేందుకు రంగం సిద్ధమైంది.
ఇలా ఒకరిద్దరు కాదు, దాదాపు 90శాతం మీడియా ప్రతినిధులు కొండపై రాబందుల్లా తయారయ్యారు. అవినీతికి అడ్డాలుగా మారారు. వాళ్లందరి జాతకాల్ని టీటీడీ బయటకు తీస్తోంది, సదరు సంస్థల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్తోంది. 25 రూపాయల విలువ చేసే లడ్డూ నుంచి లక్ష రూపాయలు విలువ చేసే సేవల వరకు వీళ్లు ఎలా చక్రం తిప్పుతున్నారనే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో కొండపై మీడియా పాతిన అవినీతి వృక్షం కూకటివేళ్లు కదులుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ అనుకున్న మార్పు మొదలైంది.