రాజకీయ డ్రామాకు వాళ్లంతా ఎందుకు బాబూ?

చంద్రబాబునాయుడు ఒక విషయం నిర్ధరించారు. తాను 14వ తేదీన 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే.. ప్రభుత్వం జడుసుకున్నదని ఆయన గుర్తించారు. తన దీక్షకు భయపడి.. జగన్మోహన రెడ్డి ఇసుక…

చంద్రబాబునాయుడు ఒక విషయం నిర్ధరించారు. తాను 14వ తేదీన 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే.. ప్రభుత్వం జడుసుకున్నదని ఆయన గుర్తించారు. తన దీక్షకు భయపడి.. జగన్మోహన రెడ్డి ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని కూడా తేల్చేశారు.

ఇదంతా బాగానే ఉంది.. చంద్రబాబుకు భయపడ్డారో లేదో మొత్తానికి జగన్ సర్కారు ఇసుకను రోజుకు రెండులక్షల టన్నుల వంతున అందుబాటులో ఉంచబోతోంది. అయినా సరే చంద్రబాబునాయుడు మాత్రం తాను తలపెట్టిన దీక్షను చేయదలచుకున్నారు.

రాజకీయ మనుగడ కోసం.. ప్రజల్లో హైప్ సృష్టించడం కోసం ఇలాంటి డ్రామా ఒకటి ఆయనకు అవసరమే అనుకోవచ్చు. కానీ… ఇప్పుడిప్పుడే చురుగ్గా జరుగుతున్న తమ కూలి పనులు మానుకుని.. భవన నిర్మాణ కార్మికులంతా తన దీక్షకు తరలి రావాలని ఆయన పిలుపు ఇవ్వడం ఎందుకు?

చంద్రబాబునాయుడు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారు. దీన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఉచితానుచితాలతో నిమిత్తంలేకుండా ప్రభుత్వం చేసే ప్రతిపనినీ విమర్శిస్తూ పోతే తప్ప.. ప్రతిపక్ష పార్టీలకు మనుగడ ఉండదు.

ఆ భయంలో చంద్రబాబు ఎన్ని మాటలైనా అనవచ్చు. ఎన్ని దీక్షలైనా చేయవచ్చు? తన మాటలకు భయపడే జగన్మోహన రెడ్డి ప్రజలను చక్కగా చూసుకుంటున్నారని మంచి పరిపాలన అందిస్తున్నారని కూడా ఆయన ప్రకటించుకోవచ్చు. అది ఆయన ఇష్టం.

కానీ.. వర్షాలు.. ఇసుక లభ్యత లేకపోవడం కారణంగా కొన్ని రోజులగా మందగించి ఉన్న నిర్మాణరంగం ఇప్పుడే గాడిన పడుతోంది. కొన్నాళ్లుగా ఇసుక అవైలబిలిటీ పెరుగుతోంది. లక్షటన్నులకు పైగా ఇప్పుడు ప్రతిరోజూ దొరుకుతోంది. రేపటినుంచి ఇసుక వారోత్సవాలని ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రకటించారు. రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో రీచ్ ల సంఖ్యను కూడా పెంచారు. ప్రభుత్వ పరంగా ఎన్ని ఏర్పాట్లు చేయవచ్చో అంతా చేస్తున్నారు.

ఇప్పుడు చంద్రబాబు దీక్షకు కూర్చుంటూ.. కార్మికులంతా రావాలని పిలుపు ఇవ్వడమే కామెడీ. పనులు ముమ్మరంగా మొదలయ్యాక.. అవన్నీ వదలిపెట్టా వాళ్లంతా ఆయన దీక్షకు రావాలని పిలిచినట్లుగా ఉంది. రాజకీయ హడావిడి అవసరం అనుకుంటే… పార్టీవారంతా తరలివస్తారుగానీ.. కూలిపనులతో పొట్టపోసుకునే సామాన్యులు ఎందుకు రావాలి?