Advertisement

Advertisement


Home > Politics - Gossip

బీజేపీ గాలానికి పవన్ చిక్కుతాడా?

బీజేపీ గాలానికి పవన్ చిక్కుతాడా?

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అత్యంత పగడ్బందీగా అమలు చేస్తోంది. నాలుగు పెద్ద చేపలు ఆల్రెడీ బుట్టలో పడ్డాయి. చిన్నా చితకా చేపలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బీజేపీ గాలానికి చిక్కుతున్నాయి. ఫైనల్ గా ఆ పార్టీ ఒక బలమైన నేత కోసం ఎదురు చూస్తోంది. అతనే పవన్ కల్యాణ్. ఏపీలో బీజేపీకి నిజంగా ఇమేజ్ పెరగాలంటే, అట్రాక్షన్ రావాలంటే.. పవర్ స్టార్ ఆ పార్టీలోకి రావాల్సిందే. అందు కోసం తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు బీజేపీ నేతలు.

వాస్తవానికి ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ కి బీజేపీలో చేరేందుకు ఆఫర్ వచ్చింది. అప్పుడున్న ఓవర్ కాన్ఫిడెన్స్, బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాలేదన్న అనుమానంతో పవన్ నో చెప్పేశారు. అనుకోకుండా చంద్రబాబు చేతిలో పావులా మారి రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. జనసేనని బీజేపీలో విలీనం చేయాలనే ఉద్దేశం పవన్ కల్యాణ్ కి లేకపోయినా.. బీజేపీ మాత్రం ఆయన కోసం అర్రులు చాస్తోంది.

ఏపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎంతమంది వచ్చి చేరినా.. చెప్పుకోడానికి ఓ బలమైన నాయకుడు కావాలని, ఆ నాయకుడి పేరుమీద ఏపీలో పార్టీని పటిష్టం చేయాలనేది బీజేపీ ఆలోచన. అందుకే కాపు సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా ఒడిసిపడుతోంది. ఏపీలో రెడ్లకు వైసీపీ, కమ్మోళ్లకు టీడీపీ, కాపులకు బీజేపీ.. ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని చూస్తోంది కమలదళం.

బీజేపీ అనుకున్నట్టుగానే కొంతవరకు కులసమీకరణ జరిగింది. ఇక ఆ సామాజికవర్గంలో బలమైన నాయకుడు పవన్ కల్యాణ్ బీజేపీతో కలసిపోతే ఆ పార్టీ అనుకున్న లక్ష్యం చేరుకున్నట్టే. అందుకే కేంద్రంలో పెద్దలు పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా సంప్రదింపులు జరుపుతున్నారట. రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారట. అయితే పవన్ మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన మెత్తబడకపోయినా రాబోయే రోజుల్లో బీజేపీ అవసరం పవన్ కల్యాణ్ కి ఉందనే విషయాన్ని ఆయనకు తెలియజేయాలనుకుంటున్నారు కమలనాథులు.

పవన్ అనుమానం ఒక్కటే.. గతంలో తన అన్నయ్య ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేసి తప్పుచేసినట్టే తను జనసేనను బీజేపీలో విలీనం చేస్తే అది చారిత్రక తప్పిదం అవుతుందేమోనని అనుమాన పడుతున్నారు. అనుమానం కాదు, అది నిజం కూడా. పవన్ కూడా అన్నయ్య బాటలో నడిస్తే, మెగా కాంపౌండ్ కు ఇక రాజకీయాల్లోకి ప్రవేశించే అర్హత ఉండదు. దీనికితోడు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని బలంగా డిమాండ్ చేసిన తాను.. హోదా ఇవ్వలేమని తెగేసి చెప్పిన పార్టీతో ఎలా కలసిపోవాలా అని దీర్ఘాలోచనలో పడ్డారు. అందుకే ముందూవెనక ఆడుతున్నారు.

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?