Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ ‘సుప్రీం’ను ఆశ్రయిస్తారా?

జగన్ ‘సుప్రీం’ను ఆశ్రయిస్తారా?

జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి మూడు నెలల్లోపే తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఆషామాషీ ఎదురుదెబ్బ కాదు. చాలా గట్టిది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసేసుకుని, రీటెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించేసిన తర్వాత.. హైకోర్టు కాంట్రాక్టు రద్దు ఉత్తర్వులను సస్పెండ్ చేయడం మామూలు విషయం కాదు. ఇలాంటి తీర్పు వలన ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించడం అసాధ్యం అయినప్పటికీ... ఇది ఎదురుదెబ్బే. దీనిపట్ల జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దీనికి సంబంధించి అధికార్లతో సుదీర్ఘ సమావేశం పెట్టుకున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమా? లేదా? అనేది జగన్ సర్కారు ముందున్న మీమాంస. జలవిద్యుత్ కేంద్రం విషయంలో హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చింది గనుక.. దానిని వదిలేసి.. ప్రధాన డ్యాం పనులకు పిలిచిన రీటెండరు విషయంలో మాత్రం ముందుకు సాగడానికి తగ్గట్లుగా అధికారులతో చర్చలు సాగాయి. అయితే అవి కూడా ఒక కొలిక్కిరాలేదు.

సాధారణంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడే.. సంబంధిత అధికార్లంతో దానికి సంబంధించి.. తర్వాత ఎలా ముందుకువెళ్లవచ్చో ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలతో సిద్ధమై ఉంటారు. సాధారణంగా వాటినే ప్రభుత్వాధినేత ముందు ప్రతిపాదిస్తారు. కానీ ఇంకా వ్యవహారం తెగలేదు. మూడు శాఖల అధికారులతో జగన్ సమావేశం అయినప్పటికీ కూడా ఇంకా నిర్ణయం జరగలేదు. చూడబోతే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి గల అవకాశాలను తేల్చుకోవడానికి ఇంకా మధనం సాగుతున్నట్లుగా ఉంది.

అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా జగన్ ప్రభుత్వం ఏం సాధిస్తుంది? తాము తీసుకున్న నిర్ణయంలో లోపం లేదని, చిత్తశుద్ధితోనే ఆ నిర్ణయం తీసుకున్నామని మరోసారి కోర్టు ఎదుట, తద్వారా ప్రజలకు ‘కమ్యూనికేట్’ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మరేం జరగదు. సుప్రీంలో ప్రభుత్వ అనుకూల నిర్ణయం వస్తుందనే గ్యారంటీలేదు. ఇలాంటి నేపధ్యంలో సుప్రీం గడపతొక్కితే.. జగన్ మీద ప్రతిపక్షాలు మరిన్ని విమర్శలు గుప్పించడానికి ఆస్కారం దొరుకుతుంది.

హైకోర్టు తీర్పును ఖాతరు చేయకుండా, సుప్రీంకు వెళ్లిన మొండివాడు అని విమర్శిస్తారు. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలితే.. జగన్ ఇమేజికి ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. ఈలోగా.. అసలు నిర్మాణ పనుల్లో పూడ్చలేనంత జాప్యం చోటుచేసుకుంటుంది. ఇన్ని సంభావ్యతల మధ్య జగన్మోహనరెడ్డి సుప్రీంకు వెళ్లే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?