Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాలినేని బ్లాక్ మెయిల్‌పై వైసీపీ కీల‌క నిర్ణ‌యం!

బాలినేని బ్లాక్ మెయిల్‌పై వైసీపీ కీల‌క నిర్ణ‌యం!

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి బ్లాక్ మెయిల్‌కు లొంగొద్ద‌ని వైసీపీ అధిష్టానం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. బాలినేని వ‌ల్ల వైసీపీకి న‌ష్ట‌మే త‌ప్ప‌, ఎలాంటి లాభం లేద‌నే అభిప్రాయానికి ఆ పార్టీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. త‌ర‌చూ బాలినేని అల‌క‌పాన్పు ఎక్క‌డంపై వైసీపీ అస‌హ‌నంగా వుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు బాలినేని స‌మీప బంధువు. బాలినేనికి మొద‌టి నుంచి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన మొద‌లు బాలినేని అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. త‌న జిల్లాకే చెందిన ఆదిమూల‌పు సురేష్‌ను కొన‌సాగించ‌డం బాలినేనికి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టైంది. మంత్రి సురేష్‌తో బాలినేనికి విభేదాలున్నాయి. అలాంటిది సురేష్‌ను కొన‌సాగిస్తూ, త‌న‌ను తొల‌గించ‌డాన్ని బాలినేని అవ‌మానంగా భావించారు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ మార్కాపురం ప‌ర్య‌ట‌న‌లో బాలినేనికి అవ‌మానం జ‌రిగింది.

సీఎం హెలీప్యాడ్ వ‌ద్ద‌కు బాలినేని వాహ‌నాన్ని అనుమ‌తించ‌లేదు. ఇదంతా మంత్రి సురేష్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే చేశార‌ని బాలినేని ఆగ్ర‌హించారు. ఈ సంద‌ర్భంగా బాలినేని అల‌కబూనారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను సీఎం పిలిపించుకుని, సంక్షేమ కార్య‌క్ర‌మ బ‌ట‌న్ నొక్కించి ల‌బ్ధిదారుల ఖాతాలో డ‌బ్బు జ‌మ చేయించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిత్తూరు, తిరుప‌తి, నెల్లూరు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వికి బాలినేని రాజీనామా చేయ‌డం వైసీపీలో క‌ల‌క‌లం రేపింది.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో కోఆర్డినేట‌ర్ ప‌ద‌వికి న్యాయం చేయ‌లేన‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తిరగాల్సిన అవ‌స‌రం వుంద‌ని బాలినేని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఇదంతా పైకి చెబుతున్న‌దే త‌ప్ప‌, అస‌లు నిజం పార్టీపై కోపం అని వైసీపీ పెద్ద‌లు చెబుతున్నారు. బాలినేనితో పార్టీ పెద్ద‌లు మాట్లాడిన‌ప్ప‌టికీ స‌సేమిరా అన్న‌ట్టు తెలిసింది. బాలినేనిలో వేరే రాజ‌కీయ ఆలోచ‌న‌లు కూడా ఉన్న‌ట్టు వైసీపీ పెద్ద‌ల‌కు స‌మాచారం వుంది.

దీంతో ఇక ఆయ‌న్ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వైసీపీ ముఖ్య నేత‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌కాశం జిల్లాలో మొద‌టి నుంచి వైసీపీ బ‌ల‌హీనప‌డ‌డానికి బాలినేని వ్య‌వ‌హార శైలే కార‌ణ‌మ‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు గుర్తించిన‌ట్టు తెలిసింది. గ‌తంలో న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీ మారేందుకు బాలినేని ప్రోత్స‌హించార‌నే స‌మాచారం ఆ పార్టీ పెద్ద‌ల దృష్టిలో ఉంది.

ఈ నేప‌థ్యంలో బాలినేని ఉద్దేశ పూర్వ‌కంగానే పార్టీకి న‌ష్టం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఆయ‌న్ను అలా వ‌దిలేయ‌డం మంచిద‌నే అభిప్రాయానికి రావ‌డం గ‌మ‌నార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?