తెదేపాది వ్యవస్థ- వైకాపాది అవస్థ

“పులిహార కలపడం” అనే ఒక నానుడు ఉంది కొన్ని తెలుగుప్రాంతాల్లో. ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడుతూ సంబంధబాంధవ్యాల్ని తనకు అనుకూలంగా మలచుకోవడమనే ప్రక్రియకి ఇది ముద్దుపేరు.  Advertisement దేశాన్ని వ్యవస్థలు నడుపుతాయి. కానీ ఆ…

“పులిహార కలపడం” అనే ఒక నానుడు ఉంది కొన్ని తెలుగుప్రాంతాల్లో. ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడుతూ సంబంధబాంధవ్యాల్ని తనకు అనుకూలంగా మలచుకోవడమనే ప్రక్రియకి ఇది ముద్దుపేరు. 

దేశాన్ని వ్యవస్థలు నడుపుతాయి. కానీ ఆ వ్యవస్థల్ని నడిపేది మనుషులే. “మేన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్” అని అరిస్టాటిల్ క్రీస్త్రుపూర్వమే చెప్పాడు. కోరిక లేని మనిషి ఉండడు. వ్యవస్థల్ని నడిపే మనుషులయొక్క అవసరాలు కనిపెట్టడం ఒక పెద్ద కళ. 

వ్యవస్థల్ని నడిపే మనుషులు రూల్స్ ప్రకారమే పని చేసినా ఎప్పుడైతే వాళ్ల కోరికల్ని, ఆశల్ని తీర్చే శక్తి తమ ముందుకొస్తుందో ఆ శక్తికి తలవంచుతారు. అలా వంచిన తలని సుతారంగా నిమిరి మచ్చికచేసుకుని విశ్వాసంతో బతికేలా చేసుకోవాలి. 

అలాగని పని అవసరం పడ్డప్పుడు వీళ్ళని వాడుకోవచ్చులే అనుకుని సమయాన్ని వృధా చేయకూడదిక్కడ. ఆయా వ్యవస్థల్ని నడిపే వ్యక్తుల చేతిలో ఉండే ఉద్యోగాల్లో “మా అన్నగారి అబ్బాయండి”, “మాకు బాగా కావల్సిన వాడండి”, “మంచివాడండి..మీకూ పనికొస్తాడండి” అని చెబుతూ సొంత మనుషులకి ఉద్యోగాలు వేయించుకుంటూ వెళ్లాలి. అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కొన్నేళ్లకి సీనియర్ పొజిషన్ కి చేరతారు. మొదట పరిచయమున్న వ్యక్తులు రిటైరయిపోయినా, అసలే పోయినా మన ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లు మనపట్ల కృతజ్ఞత చూపిస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. 

అప్పటికీ ఆపకుండా మరో తరంలో కూడా సొంత మనుషుల్ని వ్యవస్థల్లో కీలక పదవుల్లో ప్లాంట్ చేసుకోవడమనేది ఇక్కడ కీలకం. అలా నాటబడ్డ వాళ్ల నుంచి వీచే కృతజ్ఞతాపవనాల్ని అవసరమొచ్చినప్పుడల్లా స్వార్ధానికి వాడుకోవచ్చు. ఎన్ని చెట్లు నాటితే అంత ఆక్సీజన్ అన్నట్టుగా ఎంతమంది సొంతమనుషుల్ని వ్యవస్థలో నాటితే అంత పవర్ ఉన్నట్టు. జనం వోట్లేసి గెలిపించకపోయినా పవర్ చేతిలో ఉన్నట్టే లెక్క.

తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బతుకుతున్నది దశాబ్దాలుగా ఈ “పులహార కలపడంతోనే”. దానివల్లే ప్రతిపక్షంలో ఉన్నా కూడా బ్యాక్ డోర్ నుంచి పవర్ వెలగబెడుతూనే ఉంటారు తెదేపా అధినాయకులు. 

ఈ విద్యని వైకాపా వాళ్లు తప్పుపట్టి వెక్కిరిస్తారు తప్ప తాము కూడా ఎంతో కొంత నేర్చుకోవాలని అనుకోరు. ప్లాంటింగ్ చేసేంత కాకపోయినా కనీసం కేంద్రంలోని పవర్ సెంటర్స్ లో ఉన్న ఆఫీసర్స్ తో “పులిహార కలిపే” నైపుణ్యం ఉందా అంటే అనుమానమే. 

శత్రువు కత్తి పట్టుకుని దిగితేనే కత్తియుద్ధం చేస్తాను…గదపట్టుకొస్తే చేయలేను, నాకు చేతకాదు అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది? గదపెట్టి మోదితే మోదించుకోవడమే అవుతుంది. కాబట్టి తెదేపా వ్యూహానికి తగ్గ వ్యూహం అదే దారిలో పన్నకపోతే మొదటికే మోసమొస్తుంది. 

పవర్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కనీసం తన బాబాయి భాస్కర్ రెడ్డి అరెస్టుని ఆపలేకపోయారు. కానీ అప్పట్లో పవర్లో లేని చంద్రబాబు తన బావమరిది బాలకృష్ణను మాత్రం గన్ షూటింగ్ కేసులో జైలుకు పోకుండా ఆపగలిగాడు. 

“ఎవరూ నా మీద కంప్లైంట్ చెయ్యలేదు. నేను ఎవరెవరి దగ్గర ఎంత పెట్టుబడులు తీసుకున్నానో దానికి మరింత లాభాన్ని జోడించి వాళ్లకి వెనక్కి చెల్లించాను” అని జగన్ మోహన్ రెడ్డి అన్నా కూడా అవన్నీ ట్రయల్లో చెప్పుకో అని ముందు తీసుకెళ్లి జైల్లో పెట్టేసారు.  అదే సేం డైలాగ్ మార్గదర్శి విషయంలో రామోజీ రావు కొడితే మొన్నటి వరకు అసలాయన్ని టచ్ చేసిన వ్యవస్థ లేదు. వుండవల్లి తాటాకు చప్పుళ్లు తప్ప జైలు గేటు తెరుచుకున్న సౌండే వినపడలేదు. మరి రామోజి తెదేపాకి అస్మదీయుడైన రాజగురువు కదా! 

కనిపించే, వినిపించే సాక్ష్యాలు ఏవీ లేకపోయినా పెట్టబడ్డ కేసులతో జగన్ మోహన్ రెడ్డి నెలల తరబడి జైల్లో కూర్చున్నారు. “ఓటుకి నోటు” కేసులో ఆడియో వీడియోతో సహా దొరికినా చంద్రబాబు జైలుగుమ్మమే కాదు కోర్టు గుమ్మం తొక్కినట్టు కూడా ఎవరూ చూడలేదు. 

పవర్ చేతులో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి తన కోసం సోషల్ మీడియాలో పని చేసి కేసుల్లో ఇరుక్కున్న వాళ్లని జైలు నుంచి బయటకి తీసుకురాలేకపోయారు. లాయర్లని పెట్టి వాళ్లకి ఫీజులు చెల్లించారు తప్ప అంతకంటే పైస్థాయిలో ఏ పావూ కదపలేకపోయారు. 

పవర్ చేతిలో లేకపోయినా గత నాలుగేళ్లుగా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులొస్తుంటే చంద్రబాబు మందహాసంతో వైనం చూస్తూ కూర్చున్నాడు. 

వ్యవస్థలో అస్మదీయులుండబట్టే కదా అప్పట్లో చంద్రబాబు పార్టీని, గుర్తుని సైతం మామగారి నుంచి చట్టబద్ధంగా లాగేసుకోగలిగాడు.  

వ్యవస్థలో తనవాళ్లు లేకపోబట్టే కదా రాజధానుల మీద కూడా స్పష్టత తీసుకురాలేక జగన్ మోహన్ రెడ్డి తికమక పడుతున్నది!

వ్యవస్థ తెదేపాది- అవస్థ వైకాపాది అన్నట్టుగా ఉంది. 

మిత్రులకంటే శత్రువులనుంచే మంచి పాఠాలు నేర్చుకోవచ్చు. శత్రువు అడ్వాన్స్డ్ ఆయుధంతో ముందుకొస్తే రాతియుగం నాటి ఆయుధాలు పట్టుకుని కూర్చుంటే ఏం లాభం. 

తెదేపా అధినాయకత్వానికి తెలిసినవి వెన్నుపోట్లు, దొడ్డి దార్లు. మొదటిది కాకపోయినా, రెండోది ముఖ్యమనిపించేలా ఉంది. బ్యాక్ డోర్ పాలిటిక్స్ పై వైకాపా కూడా కాస్త దృష్టి సారించాలేమో. 

అలా కాకుండా “నా దారి రహదారి” అని పాచిపోయిన పాత రజనీకాంత్ డైలాగ్ ని కొట్టుకుంటూ కూర్చుంటే అవతల దొడ్డి గుమ్మంలోంచి తెదేపా వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని వైకాపా శ్రేణుల్ని ఇంకా వెక్కిరిస్తూనే ఉంటుంది. అందుకే వైకాపా వాళ్లు కూడా “పులిహార కలపడం” మొదలుపెట్టాలేమో. 

– హరగోపాల్ సూరపనేని