ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంపై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్యే తన ఇంగ్లీష్ తిప్పలు చెప్పుకున్న సందర్భంలో నవ్వులు విరిశాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సీఎం జగన్‌కు సన్నిహితుడు. ఆయన ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్టు అమాయకంగా మాట్లాడుతుంటారు. అది అసెంబ్లీ అయినా, బయటైనా.
బియ్యపు మధుసూదన్‌రెడ్డి తన ఆరకొర ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎలాంటి కష్టాలు తెచ్చిందో చెబుతున్నప్పుడు అసెంబ్లీ హాలంతా గొల్లుమని నవ్వింది. అసెంబ్లీలో ఆయన ఏమన్నారంటే…
“ఈ మధ్య జగనన్న అమెరికా పోయినప్పుడు నేనూ పోయినా. అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌లో ఒక విషయాన్ని అడిగారు… ఎందు కొచ్చినావ్ అమెరికాకు అని? నాకు తెలిసీతెలియని భాషలో ఇట్స్ ఎ బిగ్ మీటింగ్, కమింగ్, గ్యాదరింగ్, ఐ యామ్ గోయింగ్ టు మీటింగ్ సార్ అని అన్నా. వాళ్లకి అర్థం కాలేదు…అలా అనకూడదంట. నన్ను ఎత్తుకెళ్లి పక్కనేసినారు టు అవర్స్. నాకు చెమట పట్టిపోయింది. అప్పుడు వాసుదేవరెడ్డి అనే డాక్టర్‌కు ఫోన్ చేసినా. ఏమి చెప్పాలని. బంధువుల ఇంటికి వచ్చినామని వాళ్లు చెప్పమన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో నేను అంత టెన్సన్‌పడ్డా అమెరికాలో. నాతో పాటు వచ్చిన వాళ్లకు కూడా ఇంగ్లీష్ అంతంతే. ఇద్దరి పరిస్థితి ఒకటే” అని చెప్పాడు. దీంతో అసెంబ్లీ హాలంతా బిగ్గరగా నవ్వారు.
ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నారు. అందువల్ల చంద్రబాబు కూడా ఆంగ్ల మాధ్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరాడు.