cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

సినిమా రివ్యూ: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

సమీక్ష: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
రేటింగ్‌: 1/5
బ్యానర్‌:
టైగర్‌/కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసోర్‌ ప్రొడక్షన్‌
తారాగణం: అజ్మల్‌ అమీర్‌, ధనంజయ్‌ ప్రభునే, ధీరజ్‌, అలీ, ధన్‌రాజ్‌, బ్రహ్మానందం, పృధ్వీ తదితరులు
సంగీతం: రవి శంకర్‌
కూర్పు: అన్వర్‌ అలీ
ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి
నిర్మాత: అజయ్‌ మైసోర్‌
కథ, కథనం: రామ్‌గోపాల్‌వర్మ, కరుణ్‌ వెంకట్‌
దర్శకత్వం: సిద్ధార్థ తాతోలు
విడుదల తేదీ: డిసెంబర్‌ 12, 2019

ఎవరి మీదో కసి తీర్చుకోవడానికో, లేదా మరెవరి మీదో మోజు ప్రదర్శించుకోవడానికో... ఈ చిత్రం తీసిన ఉద్ధేశం ఏదైనా కావచ్చు. ఇది చూస్తున్నంతసేపు నాకు తెరపై కనిపించింది మాత్రం 'భావదారిద్య్రం'! అఫ్‌కోర్స్‌ రామ్‌గోపాల్‌వర్మ ఇటీవల తీస్తోన్న చాలా చిత్రాల్లో అదే కనిపిస్తున్నా కానీ ఇందులో అది 'కొత్త పుంతలు' తొక్కింది. భావ ప్రకటన స్వేఛ్ఛని ఇంత తుచ్చంగా వాడుకోవచ్చా? ఎంత పబ్లిక్‌ ఫిగర్స్‌ అయితే మాత్రం వారి పర్సనల్‌ స్పేస్‌లోకి ఇంత నిస్సిగ్గుగా చొరబడవచ్చా? నారా లోకేష్‌పై జరిగే ట్రోలింగ్‌ చుట్టూ ఈ చిత్రాన్ని కేంద్రీకరించి చీప్‌ కామెడీతో చిల్లర రాబట్టుకోవాలనే ఎత్తుగడని బిజినెస్‌ కోణంలో చూసి సరిపెట్టుకోవచ్చు. మరి అతని భార్య బ్రాహ్మణిని ఈ కథలో అంతటి సెంట్రల్‌ క్యారెక్టర్‌గా మార్చడాన్ని ఎలా సమర్ధించుకుంటారు? ఆమెని పిలిచి తన 'మామ' క్షమించమని చెప్పడం గీత దాటడం అనుకుంటే... ఒక రాజకీయ కుట్రని ఆమె ప్లాన్‌ చేసిందని చెప్పడం, విజయ్‌ మాల్యాలా లండన్‌ పారిపోయి తల దాచుకుందని అనడం భావ ప్రకటనలో విశృంఖలత్వానికి నిదర్శనం.

మోరాలిటీస్‌ గురించి పక్కన పెట్టేస్తే (అవి మాట్లాడుకుంటే ఇక దీనినో సినిమాగా చూడడం కూడా అనవసరం) కనీసం ఒక పేరడీగా అయినా ఈ చిత్రంలో ఏమి చూపించదలిచారు? జగన్‌ అభిమానులు అతని పోటీదారులైన వారిపై వర్మ వేసిన సెటైర్లని చూసి అంతో ఇంతో నవ్వుకుంటారు. అలాగే జగన్‌, చంద్రబాబు, పవన్‌, లోకేష్‌, పాల్‌ తదితరుల పాత్రలకి ఎంచుకున్న నటులు అతి దగ్గరి పోలికలతో పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా పోల్చుకునేలా వున్నారు. వారికి డబ్బింగ్‌ చెప్పిన మిమిక్రీ ఆర్టిస్టులు పోలికని ఇంకాస్త రియలిస్టిక్‌గా మార్చారు. అంతే... ఈ చిత్రం గురించిన మెప్పించే అంశం ఏదైనా వుంటే అంతవరకే. స్పూఫ్‌ చేయడంలో, ఆర్టిస్టులని పట్టడంలో వర్మ తన ప్రత్యేకత ఇంకోసారి చాటుకున్నాడంతే. మిగతా సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... ట్రెయిలర్‌లో చూసిన దానికి మించి మరేదీ తెరపై కనిపించదు.

ట్రెయిలర్‌ చూసి వర్మ ఏదో పెద్ద సెటైర్‌ వేసేసేడాని, తెలుగుదేశం వాళ్లని విపరీతంగా ట్రోల్‌ చేసేసాడని ఎక్స్‌పెక్ట్‌ చేసి వెళితే సినిమా మొదలైన పది నిమిషాలకే మోసపోయిన సంగతి తెలిసిపోతుంది. ఒక్కసారి అసెంబ్లీ సెషన్‌ సీన్‌లో రభస స్టార్ట్‌ అయిన తర్వాత ఇక తిరిగి చూడడముండదు. అంతకంతకీ సోకాల్డ్‌ సెటైర్లు, స్పూఫ్‌లు పలచబడిపోయి మిగతా టైమ్‌లో ఏమి చేయాలో తెలియని అయోమయంతో రాసుకున్న సన్నివేశాలతో, సృష్టించిన అర్థంలేని పాత్రలతో గందరగోళం ఎక్కువైపోతుంది. 'దయనేని రమ' హత్య తర్వాత ఏదైనా పొలిటికల్‌ డ్రామా వుంటుందేమో అనుకుంటే 'కామెడీ' అని రచయితలు ఫీలయిన టీవీ 9 స్వప్న, కత్తి మహేష్‌ల ప్రహసనం సహనాన్ని పరీక్షిస్తుంది. మధ్యమధ్యలో ఇరికించిన పవన్‌కళ్యాణ్‌ స్పీచ్‌లు కూడా విషయం లేక పేలలేదు. కె.ఏ. పాల్‌ పాత్రపై చాలా సన్నివేశాలు తీసినా కానీ జాఫర్‌తో ఇంటర్వ్యూ సీనొకటి తప్ప ఇంకేదీ నవ్వించలేదు. రియల్‌ లైఫ్‌ సీఎంలు, పొలిటికల్‌ సీన్లపై సినిమాలు తీయడమనేది గతంలోను జరిగింది కానీ ఇలా ఎలాంటి పర్పస్‌ లేని సినిమా తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనిపిస్తుంది. ఇలాంటి ఒక నిరర్ధక చిత్రం వల్ల ప్రేక్షకుల విలువైన సమయం కూడా వృధా అవడం మినహా ఒరిగేదేముంటుంది.

నిజంగా సదరు పొలిటీషియన్లపై సెటైర్లే వేయాలనుకుంటే ఇంత కంటే గొప్పగా మీమ్‌ మేకర్లు, స్పూఫ్‌ వీడియోలు చేసే వాళ్లు యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కొల్లలుగా కనిపిస్తుంటారు. కొన్ని వైరల్‌ అయిన వీడియోలని, వాళ్లకి మ్యాచ్‌ అయ్యే నటులని తీసుకుని షూట్‌ చేసి వాటి చుట్టూ ఒక కథ అల్లి, సినిమా తీయడమేమిటో... భావదారిద్య్రం కాకపోతే! ట్రెయిలర్‌ చూసిన తర్వాత కూడా అత్యంత లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నా కూడా ఇది అంతకంటే దారుణంగా నిరాశపరిచి వీలయినంత త్వరగా బయటపడిపోవాలనే కోరికని బలంగా కలిగిస్తుంది. రాంగోపాల్‌వర్మ తీస్తోన్న 'ట్రెయిలర్‌' సినిమాలన్నీ చూసాక కూడా ఇక కొత్తగా ఇది చూడడం దేనికని అడగవచ్చు కానీ సినీ సమీక్షకులకి, విశ్లేషకులకీ తప్పదీ పని. సినిమాలపై రివ్యూలు రాసి కొంతమంది ప్రేక్షకులని ప్రభావితం చేస్తున్నారనే కోపం వున్న దర్శకులందరి తరఫున రామ్‌గోపాల్‌వర్మ ఇలాంటి సినిమాలు తీసి రివ్యూలు రాసే వారికి శిక్ష వేస్తున్నాడేమో అనే ఫీలింగ్‌ కూడా కలుగుతుంది.

ఓడిపోయిన వాళ్లని చూసి నవ్వుకోవడం ఒక రేంజ్‌ అయితే వారిని గేలి చేస్తూ సినిమా తీయడం రివెంజ్‌లో కూడా మరో లెవల్‌. కాకపోతే తీసిన ఆ సినిమాతో వాళ్లని నవ్వుల పాలు చేస్తే బాగుంటుంది కానీ తీసిన వాళ్లే నవ్వుల పాలయి.. చూసిన వారితో అక్షింతలు వేయించుకోవడం మాత్రం సెల్ఫ్‌ ట్రోల్‌. సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపే రామ్‌గోపాల్‌వర్మ సదరు వైరల్‌ వీడియోలు, మీమ్‌ల ఆధారంగా సినిమా తీసేయాలనే ఆలోచన చేయడం మాటేమో కానీ దానికోసం ఒక బేసిక్‌ కథ కూడా రాసుకోలేనంతగా ఐడియాలు ఇంకిపోవడం మాత్రం చాలా సర్‌ప్రైజింగ్‌. పవర్‌ఫుల్‌ వ్యక్తులపై ఇలా సెవెంటీ ఎంఎంలో సెటైర్లు వేయగల ధైర్యం బహుశా వర్మ ఒక్కడికే వుందేమో కానీ ఆ ధైర్యాన్ని ఛానలైజ్‌ చేసి పొరపాటున అయినా ఒక డీసెంట్‌ సినిమా తీయలేకపోవడమే అతడిని ఇప్పటికీ ఐడలైజ్‌ చేసే వారికి పెద్ద డిజప్పాయింట్‌మెంట్‌.

బాటమ్‌ లైన్‌: వర్మగారి పప్పులుడకలేదు!

గణేష్‌ రావూరి