మాజీ మంత్రి నారాయణతో తిరుపతి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యే భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల నెల్లూరుకు వెళ్లిన సదరు ఎమ్మెల్యే …నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్లి మరీ ఆయనతో చర్చించినట్టు తిరుపతి జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన ఆ ఎమ్మెల్యే…ఈ నాలుగున్నరేళ్లలో సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
రెండో దఫా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే… ఒకప్పుడు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి వర్గంగా గుర్తింపు పొందారు. మంత్రి పదవి ఆశించినప్పటికీ, వివిధ సమీకరణల రీత్యా దక్కలేదు. దీంతో టీటీడీ బోర్డు సభ్యత్వంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరిపెట్టారు. శ్రీకాళహస్తీకి కూత వేటు దూరంలో ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, సొంత పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసంతృప్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో గడపగడపకూ వెళ్లిన ఎమ్మెల్యేను సొంత పార్టీ నాయకులే ఎక్కడికక్కడ నిలదీయడం చర్చనీయాంశమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా ఆయనకు టికెట్ ఇవ్వరనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి, తమ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ కాదు, కూడదని టికెట్ ఇస్తే ఓడిస్తామనే సంకేతాలు సీఎంకు ఇచ్చారు.
నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి నిరాధరణ ఎదురవడంతో టికెట్ ఇవ్వరనే నిర్ణయానికి ఆ ఎమ్మెల్యే వచ్చారు. దీంతో ఆయన మాజీ మంత్రి నారాయణతో చర్చలు జరపడం రకరకాల ఊహాగానాలకు అవకాశం కల్పించింది. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వరనే సంకేతాలు వెలువడితే టీడీపీ నుంచి దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.