పచ్చ నిరసనల్లో వక్ర వ్యూహాలు!

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం.. నిర్ణయాలు తీసేసుకుంటున్నదా? పనిచేసేస్తున్నదా? ఫలానా నిర్ణయాన్ని ఫలానా రోజునుంచి అమల్లో పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి… ముందే సమాచారం చిక్కితే చాలు.. నాలుగురోజులు ముందుగా.. నిరసనలు, ప్రదర్శనలు చేసేయాలి. ఆ…

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం.. నిర్ణయాలు తీసేసుకుంటున్నదా? పనిచేసేస్తున్నదా? ఫలానా నిర్ణయాన్ని ఫలానా రోజునుంచి అమల్లో పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి… ముందే సమాచారం చిక్కితే చాలు.. నాలుగురోజులు ముందుగా.. నిరసనలు, ప్రదర్శనలు చేసేయాలి. ఆ తర్వాత.. ప్రభుత్వం సదరు పనిని మొదలు పెట్టేస్తే.. అదంతా తమ నిరసనలు పుణ్యంగానే జరిగినట్లుగా.. తాము పోరాడబట్టి.. ప్రభుత్వంలో చలనం వచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చుకోవాలి. ఇలాంటి వక్రవ్యూహాలతో పచ్చదళాలు ఇప్పుడు పెట్రేగిపోతున్నాయి.

చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక కొరత సమస్యపై ఈనెల 30 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని, నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. ఇసుక అంశాన్ని ఎంతగా రాద్ధాంతం చేయదలచుకుంటే అంతగా చేయాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇసుక కొరత సృష్టించారని, ఇసుక ధరలు పెరిగిపోయాయని, వైకాపా నాయకులు దోచుకుంటున్నారని కొన్ని పడికట్టు ఆరోపణలు కూడా గుప్పించారు.

జగన్ ప్రభుత్వం.. ఇసుక ముసుగులో నాయకుల దోపిడీని అరికట్టడానికే కొత్త విధానం తీసుకు వచ్చింది. టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల మళ్లీ టెండర్లు పిలిచారు. మొత్తానికి సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తుందని సీఎం జగన్ ప్రకటించారు కూడా. అమల్లోకి వచ్చిన తర్వాత.. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందించడంలో తెచ్చిన తేడా ప్రజలకు స్వానుభవంలోకి వస్తుంది. మంచి చెడులు ఏ ప్రభుత్వానివో వారే నిర్ణయించుకుంటారు.

అయితే సెప్టెంబరు 5న కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తుంది గనుక.. నాల్రోజుల ముందే ఈనెల 30 న నిరసనలకు తెదేపా పిలుపుఇవ్వడం చాలా లేకిగా ఉంది. ఒకవేళ కొత్త సిస్టం అమల్లోకి వచ్చి.. అందులో లోపాలు ఉండి, ఆ లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే అప్పుడు ప్రతిపక్షం నిరసనలు చేసిన పరువుగా ఉంటుంది. వారు పనిచేయబోతున్నారని తెలిసి.. ఆ పనిచేయాలంటూ ముందే నిరసనలు చేయడం వక్ర వ్యూహమే.

ఇది తెదేపాకు కొత్త కాదు. అమరావతి రైతులకు వార్షిక లీజు మొత్తం చెల్లింపులో ఇలాంటి ట్రిక్కులే ప్రయోగించారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరుల్లోనే వారి లీజు చెల్లింపులు జరుగుతాయి. అయితే కొన్నిరోజుల ముందే వారితో ధర్నాలు చేయించారు. తమ పోరాటాలతోనే, వల్లనే ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి కక్కుర్తి పడుతున్నారు.

ఇలాంటి చీప్ ట్రిక్ లను మానుకుని నిర్మాణాత్మకంగా ప్రజలకోసం పనిచేస్తే ప్రతిపక్షానికి విలువ ఉంటుంది.