చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ మీద ఐటీదాడుల నేపథ్యంలో…. అక్రమార్జనలపై ఐటీ శాఖ ప్రకటనల వలన జరిగిన పరువునష్టాన్ని పూడ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నానా యాతన పడుతోంది. పరువు నష్టం పూడ్చుకోవడం వారికి చేతయ్యేలా లేదు కానీ.. జగన్ మీద కూడా ఆ మేరకు బురద చల్లేసి.. అక్కడితో తృప్తి పడాలని భావిస్తోంది. అందుకేనేమో అనిపించేట్లుగా.. ఎక్కడెక్కడి వ్యవహారాలకు లింకులు పెట్టి… మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్టుగా.. జగన్ కు లంకెలు పెడుతూ.. పుకార్లు పుట్టించి పైశాచికానందం పొందుతున్నారు.
కొత్త ఆరోపణలు అనేకం చేస్తున్నారు. కానీ.. ఒక్కటంటే ఒక్కదానికి వారు రుజువు చూపించడం లేదు. అయి ఉండొచ్చు.. అలా ఉండొచ్చు.. ఇలా ఉండొచ్చు.. అని తామే ఊహాగానాలు చెబుతూ.. వాటికి అనుబంధంగా ఆరోపణలు మాత్రం గుప్పించడంలో రెచ్చిపోతున్నారు. ఇదంతా రాక్ – రస్ అల్ ఖైమాకు సంబంధించిన ఆరోపణల గురించే!
నిమ్మగడ్డ ప్రసాద్ కు జగన్మోహన రెడ్డితో ముడిపెట్టడం ద్వారా తెలుగుదేశం దళాలు చాలా తీవ్రమైన పుకార్లు పుట్టిస్తున్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత.. కేంద్రంలోని మోడీసర్కారుతో సాన్నిహిత్యం పెరుగుతుందేమోనని భయపడి ఇలాంటి పుకారు లేవదీస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రస్ అల్ ఖైమాతో వాన్ పిక్ ప్రాజెక్టుకు ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను బెల్‌గ్రేడ్‌లో గత ఏడాది జులైలో అరెస్టు చేశారు. అప్పటికే ఆయన మీద ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిఉన్న నేపథ్యంలో ఆ అరెస్టు జరిగింది. ఇది జరిగి దాదాపు ఏడు నెలలు కావస్తోంది. అదంతా సుమారు 900 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న లావాదేవీలకు సంబంధించిన గొడవ.
అయితే జగన్మోహన రెడ్డి కి ఈ కేసుతో ముడిపెట్టడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీనుంచి మీడియా ఎదుట మాట్లాడ్డానికి అవకాశం దొరికిన ప్రతి వ్యక్తీ.. జగన్ మీద విరుచుకుపడిపోతున్నారు. నేడో రేపో జగన్మోహన రెడ్డి అరెస్టు కూడా జరిగిపోతుందని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు.
రస్ అల్ ఖైమా వారి ఖైదులో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్.. వారినుంచి తీసుకున్న సొమ్ములన్నీ జగన్మోహన రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని చెప్పి ఉండవచ్చునని.. అందువల్ల జగన్మోహన రెడ్డి కూడా నిందితుడు గనుక.. ఆయనను అరెస్టు చేసి తమకు అప్పగించవలసిందిగా కేంద్రప్రభుత్వానికి అక్కడినుంచి లేఖ వచ్చి ఉంటుందని… అందువల్ల.. అలాంటి ఇబ్బంది రాకుండా కాపాడమని అడగడానికే జగన్ మోడీ వద్దకు వెళ్లి ఉండవచ్చునని… యిలా.. ఆద్యంతం వచ్చు..వచ్చు.. అనే ఊహాగానాలతో పుకార్లు పుట్టిస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఇంతస్థాయిలో విషం చల్లే ముందు.. ఆరోపణల్లో ఏ ఒక్కటి నిలబడకపోయినా.. ప్రజల ఎదుట తమ పరువు పోతుందని పచ్చ దళాలు తెలుసుకోవాలి.